Commonwealth Games | 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారత ఒలింపిక్ సంఘం (IOA) అధికారికంగా ఆమోదం తెలిపింది. 2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు బిడ్‌ను సిద్ధం చేస్తుండగా.. బుధవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి పోటీ నుంచి కెనడా తప్పుకోవడంతో భారత్‌కు అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే ఆసక్తిని వ్యక్తం చేసిన భారత్.. బిడ్ పత్రాలను ఈ నెల 31లోగా అందజేయాల్సి ఉంది. మెగా ఈవెంట్‌కు అయ్యే ఖర్చులన్నింటినీ భారత ప్రభుత్వమే భరిస్తుందని ఐవోసీ స్పష్టం చేసింది. సమావేశం అనంతరం ఐవోసీ సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబే మాట్లాడుతూ కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి జనరల్ హౌస్ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. సన్నాహకాలను వేగవంతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల కామన్వెల్త్ స్పోర్ట్ గేమ్స్ డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని బృందం అహ్మదాబాద్‌లోని క్రీడా వేదికలను పరిశీలించడంతో పాటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమైన విషయం తెలిసిందే. మరోసారి ప్రతినిధి బృందం సైతం ఈ నెలలో పర్యటించనున్నది. ఈ నెల చివరలో కామన్వెల్త్ క్రీడల ప్రతినిధి బృందం అహ్మదాబాద్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ క్రీడల జనరల్ అసెంబ్లీ ఆతిథ్య దేశాన్ని నిర్ణయిస్తుంది. వచ్చే ఏడాది గ్లాస్గో వేదికగా జరుగనున్న క్రీడల తరహాలో కాకుండా.. 2030 పూర్తిస్థాయిలో క్రీడలను నిర్వహించనున్నట్లు ఐవోసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు రోహిత్ రాజ్‌పాల్ పేర్కొన్నారు. షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ తదితర క్రీడలతోప ఆటు కబడ్డీ, ఖోఖో పోటీలను సైతం ఈ క్రీడల్లో చేర్చాలని యోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భారత్ గతంలోనూ కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. 2010లో ఢిల్లీ వేదికగా విజయవంతంగా నిర్వహించింది.