ఉదయం 9 గంటల నుంచి మొదలయ్యే ఈ టెస్టును స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో లైవ్‌లో వీక్షించొచ్చు.
అహ్మదాబాద్ : ఆసియా కప్‌ను విజయవంతంగా 9వ సారి దక్కించుకున్న భారత క్రికెట్ జట్టు వారం రోజులు కూడా తిరగకముందే మరో సిరీస్‌కు సిద్ధమైంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమ్ఇండియా.. స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి అహ్మదాబాద్ వేదికగా మొదలయ్యే తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ ఏడాది జులై-ఆగస్టులో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత్‌కు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ) తాజా సైకిల్లో ఇదే మొదటి హోం సిరీస్. అంతేగాక టెస్టు సారథిగా పగ్గాలు చేపట్టాక గిల్‌కు సొంతగడ్డపై ఇదే తొలి పరీక్ష. వెస్టిండీస్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఉన్న టీమ్ఇండియా.. డబ్ల్యూటీసీలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ సిరీస్‌ను చక్కటి అవకాశంగా భావిస్తున్నది.
ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లీ, రోహిత్, అశ్విన్‌తో పాటు సీనియర్ పేసర్ షమీ లేకపోయినా అనూహ్యమైన ఆటతీరుతో ఇంగ్లిష్ జట్టుకు చుక్కలు చూపించిన భారత్ అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఉంది. ఆసియా కప్‌లో కాస్త తడబడ్డా ఇంగ్లండ్ సిరీస్‌లో 754 రన్స్ చేసిన గిల్‌కు అహ్మదాబాద్ హోంగ్రౌండ్ వంటిది. ఐపీఎల్లో ఇక్కడ గుజరాత్ టైటాన్స్‌కు పదుల సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన గిల్.. ఇంగ్లండ్ ఫామ్‌నే కొనసాగించి స్వదేశంలోనూ శెభాష్ అనిపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత రెస్ట్ తీసుకున్న జైస్వాల్, ఇటీవలే ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లో 176 పరుగులతో దుమ్మురేపిన కేఎల్ రాహుల్, మిడిలార్డర్లో సుదర్శన్ మంచి టచ్‌లో ఉన్నారు. వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. బుమ్రా, సిరాజ్‌కు అండగా మూడో పేసర్‌గా నితీశ్, ప్రసిద్ధ్‌లలో ఎవరో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది.
ఈ ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ దారుణంగా ఓడిన విండీస్.. జమైకా టెస్టులో 27 పరుగులకే ఆలౌట్ అయి తీవ్ర విమర్శలను ఎదుర్కుంది. పతనావస్థలో ఉన్న ఆ జట్టుకు భారత పర్యటన అస్థిత్వ పోరాటమే. అదీగాక సిరీస్ ఆరంభానికి ముందే స్టార్ పేసర్లు అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్ గాయాలతో దూరమవడం ఆ జట్టును మరో షాక్. ఈ క్రమంలో రోస్టన్ ఛేజ్ సారథ్యంలోని విండీస్.. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత్‌ను ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. అయితే తాము న్యూజిలాండ్ మాదిరిగానే భారత్‌కు షాకిస్తామని ఛేజ్ చెప్పడం గమనార్హం.
2024 నవంబర్ తర్వాత స్వదేశంలో తొలిసారిగా టెస్టు ఆడుతున్న భారత్.. సంప్రదాయానికి భిన్నంగా స్పిన్ పిచ్‌లకు స్వస్తి పలికి బంతికి, బ్యాట్‌కు సమంగా అనుకూలించేవిధంగా జీవమున్న పిచ్‌లను తయారుచేయించినట్టు తెలుస్తున్నది. 2024లో న్యూజిలాండ్‌తో దారుణమైన ఓటమి (0-3తో క్లీన్‌స్వీప్) తర్వాత పిచ్‌ల విషయంలో బీసీసీఐ దృక్పథం మారింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ గిల్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా వంటి కీలక పర్యటన ముందున్న నేపథ్యంలో పేసర్లకు అనుకూలించే పిచ్‌లను రూపొందించినట్టు సమాచారం. పరిస్థితులను బట్టి మూడో సీమర్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదని.. తాము ఐదు రోజులు మ్యాచ్‌లు జరిగే పిచ్‌లనే కోరుకుంటున్నామని గిల్ చెప్పడం విశేషం. మరి అహ్మదాబాద్ పిచ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మబ్బులు పట్టి ఉన్న వాతావరణంలో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్‌నే ఎంచుకోవచ్చు.