టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఘనమైన బోణీ కొట్టిన టీమ్ఇండియా..మలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న రోహిత్‌సేన..ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్నది. బుధవారం ఆతిథ్య అమెరికాతో న్యూయార్క్‌లో తలపడనుంది.భారత్ తరహాలోనే అమెరికా మంచి దూకుడు మీదుంది. కెనడా, పాకిస్థాన్‌పై విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న అమెరికా..అదే పంథాను భారత్‌పై కొనసాగించాలని చూస్తున్నది. న్యూయా ర్క్ వేదికగా ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. హ్యాట్రిక్ విజయం ద్వారా సూపర్-8 బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఇరు జట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ ఫెవరేట్ టీమ్ఇండియాకు అమెరికా దీటైన పోటీనిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
న్యూయార్క్: భారత్, అమెరికా మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నసావు స్టేడియం వేదికగా ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. టైటిల్ హాట్ ఫెవరేట్లలో ఒకటైన టీమ్ఇండియా..ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికాపై తమ ప్రతాపం చూపించాలన్న పట్టుదలతో ఉంది. పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయమిచ్చిన ఉత్సాహంతో ఉన్న రోహిత్‌సేన..యూఎస్ఏపై గెలిచి సూపర్-8 బెర్తు దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నది. పేరుకు అమెరికా అయినా జట్టంతా ప్రవాస భారతీయులతో కనిపిస్తున్నది. జట్టులో అగ్రభాగం మనోళ్లదే కావడం విశేషం. అసలు అమెరికా జట్టేనా లేక ద్వితీయశ్రేణి భారత టీమ్ అన్న సందేహం కలుగక మానదు. ఇదిలా ఉంటే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింటి గెలిచిన టీమ్ఇండియా టాప్ గేర్‌లో దూసుకెళుతుంటే..అమెరికా తామేం తక్కువ కాదన్నట్లు జోరు కనబరుస్తున్నది. పరీక్ష పెడుతున్న నసావు పిచ్‌పై ఒక అంచనాకు రాలేకపోతున్న రోహిత్‌సేన..అమెరికా జట్టును ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లోస్కోరింగ్ థ్రిల్లర్లు నమోదు అవుతున్న మెగాటోర్నీలో భారత్‌కు అమెరికా పోటీనిస్తుందో చూడాలి.
మెగాటోర్నీలో భారత్ సూపర్-8 లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. గత 11 ఏండ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం చకోరా పక్షిలా ఎదురుచూస్తున్న టీమ్ఇండియా మరీ ఈసారైనా తమ కలను సాకారం చేసుకుంటుందా అన్నది అభిమానుల మెదళ్లను తొలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతీ మ్యాచ్ కీలకం కాబోతున్నది. రెండింట విజయాలతో మెరుగైన స్థితిలో ఉన్న టీమ్ఇండియా అదే గెలుపు జోరు కొనసాగిస్తూ అమెరికా పనిపట్టాలని చూస్తున్నది. అయితే పాకిస్థాన్‌పై మన వాళ్ల బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత ఒకింత ఆందోళన కల్గిస్తున్నది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై పరుగులు ఎలా రాబట్టాలో తెలియక టీమ్ఇండియా స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. అమెరికాపై మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు రోహిత్‌సేన జాగ్రత్త పడే అవకాశముంది. యూఎస్ఏతో మ్యాచ్ కోసం పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగే చాన్స్ ఉంది. ముఖ్యంగా వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబే స్థానంపై సందిగ్ధత కొనసాగుతున్నది.
ద్వితీయ శ్రేణి భారత జట్టుగా కనిపిస్తున్న అమెరికా..మెగాటోర్నీలో సత్తాచాటాలని చూస్తున్నది. ఇప్పటికే పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన యూఎస్ఏ..భారత్‌కు పోటీనిచ్చేందుకు తహతహలాడుతున్నది. ఉద్యోగాలు, చదువుల కోసం వచ్చి స్థిరపడ్డ ప్రవాస భారతీయుల సమాహారంగా కనిపిస్తున్న అమెరికా..సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నది. గత మ్యాచ్ హీరో నేత్రవాల్కర్కు సూర్యకుమార్యాదవ్తో ఆడిన అనుభవముంది. ఇలా భారత్‌తో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న అమెరికా ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి.
జట్ల అంచనా: భారత్: రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్.
అమెరికా: మోనాంక్పటేల్(కెప్టెన్), స్టీవెన్ టేలర్, గౌస్, జోన్స్, నితీశ్, అండర్సన్, హర్మీత్‌సింగ్, జస్దీప్సింగ్, కెంజిగె, నేత్రవాల్కర్, అలీఖాన్.