IND vs SL : నామమాత్రమైన మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(116), రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (155)లు సెంచరీలతో చెలరేగడంతో 390 రన్స్ చేసింది. కోహ్లీ ఈ మ్యాచ్‌లో వీరవిహారం చేసి 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీ వరకు నిదానంగా ఆడిన అతను ఆ తర్వాత గేర్ మార్చాడు. లంక బౌలర్లను ఉతికి ఆరేస్తూ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మునపటి కోహ్లీని గుర్తు చేస్తూ ఈ సిరీస్‌లో రెండో సెంచరీ బాదాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ (42), శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 95 రన్స్ జోడించారు. కరుణరత్నే బౌలింగ్‌లో రోహిత్ క్యాచ్ అవుట్ అయ్యాడు.
గిల్ రెండో శతకం
కోహ్లీ జత కలవడంతో గిల్ చెలరేగి ఆడి స్వదేశంలో తొలి సెంచరీ సాధించాడు. 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో వంద రన్స్ కొట్టాడు. అయితే.. రజిత బంతిని సరిగా అంచనా వేయలేక బౌల్డ్ అయ్యాడు. గిల్‌ను అవుట్ చేసి ఊపిరి పీల్చుకున్న లంకకు విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. అయ్యర్‌తో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. అయ్యర్ (38), రాహుల్ (7), సూర్య (4) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో, 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 390 పరుగులు చేసింది. లంక బౌలర్లలో లహిరు కుమార రెండు వికెట్లు పడగొట్టాడు. కరుణరత్నే, కసున్ రజిత తలా ఒక వికెట్ తీశారు.
స్వదేశంలో అత్యధిక సెంచరీలు
మూడో వన్డేలో విధ్వంసక సెంచరీ సాధించిన కోహ్లీ, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్ధలు కొట్టాడు. స్వదేశంలో అత్యధికంగా 21 సెంచరీలు బాదిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ 20 సెంచరీలతో రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీం ఆమ్లా 10 సెంచరీలతో మూడో ప్లేస్‌లో ఉన్నారు. అంతేకాదు వన్డేల్లో శ్రీలంక మాజీ క్రికటెర్ మహేళ జయవర్దనే రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు.