ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ పోరుకు వేళయైంది. మెగాటోర్నీలో అపజయమెరుగకుండా ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేసిన భారత్‌కు, ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. అరేబియా అందాల నగరం దుబాయ్ వేదికగా ఆదివారం టీమ్ఇండియా, కివీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐసీసీ టోర్నీల్లో కొరకరాని కొయ్యగా మారిన కివీస్‌కు చెక్ పెట్టేందుకు టీమ్ఇండియా పావులు కదుపుతుంటే కలగా మారిన ఐసీసీ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. తమకు అచ్చొచ్చిన స్పిన్ తంత్రంతో కివీస్ రెక్కలు విరిచేందుకు రోహిత్‌సేన కదన కుతుహలంతో ఉంటే దీటైన పోటీ కోసం సాంట్నర్ గ్యాంగ్ ప్రణాళికలు రచిస్తున్నది. మొత్తంగా పుష్కర కాలం తర్వాత భారత్ మరోమారు చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని కోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.
IND vs NZ | దుబాయ్: ఏడారి తీర నగరం దుబాయ్ చిరస్మరణీయ పోరుకు వేదిక కాబోతున్నది. ఆదివారం దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు జరుగనుంది. గత 15 రోజులుగా అభిమానులను అలరిస్తున్న మెగాటోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండు అత్యుత్తమ జట్లు టైటిల్ పోరులో తలపడబోతున్నాయి. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఒడిసిపట్టుకునేందుకు భారత్ ప్రయత్నాల్లో ఉంటే..తీరని కలగా మారుతున్న ఐసీసీ ట్రోఫీని ఎలాగైనా దక్కించుకోవాలన్న గట్టి కోరికతో కివీస్ కనిపిస్తున్నది.
మెగాటోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అపజయమెరుగని రోహిత్‌సేన.. అదే ఊపులో కివీస్‌ను కట్టడి చేయాలని చూస్తున్నది. పిచ్, వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహనతో కనిపిస్తున్న భారత్ అందుకు తగ్గట్లు పక్కా వ్యూహంతో పోటీకి దిగనుంది. లీగ్ దశలో నలుగురు స్పిన్నర్లతో కివీస్‌కు చెక్ పెట్టిన టీమ్ఇండియా అదే పంథాను అనుసరించే అవకాశముంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి..టీమ్ఇండియాకు తురుపుముక్కగా మారనున్నాడు. వైవిధ్యమైన స్పిన్‌తో కివీస్ బ్యాటర్లకు వరుణ్ కళ్లెం వేసే చాన్స్ ఉంది. మరోవైపు ఫైనల్‌కు ముందు స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ గాయం కివీస్‌కు ప్రతిబంధకంగా మారింది. పిచ్‌తో సంబంధం లేకుండా స్వింగ్ రాబట్టే హెన్రీ గైర్హాజరీ కివీస్ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపించనుంది.
గత దశాబ్ద కాలంగా ‘రోకో’ ద్వయం రోహిత్‌శర్మ-విరాట్ కోహ్లీ భారత చిరస్మరణీయ విజయాల్లో కీలకమవుతూ వస్తున్నారు. తమదైన ఆటతీరుతో ప్రత్యర్థి జట్ల పాలిట సింహస్వప్నంలా మారుతూ విజయాలు అందిస్తున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉన్న ఈ ఇద్దరు తమ కెరీర్ కొనసాగిస్తారా లేదా అనేది అందరి అభిమానుల మెదళ్లను తొలుస్తున్నది. గతేడాది వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే రోకో ద్వయం తమ కెరీర్లకు అనూహ్యంగా వీడ్కోలు పలికారు. ఆదివారం కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. తమ కెరీర్‌కు ఘనమైన ముగింపు పలుకాలనే ఉద్దేశముంటే అది జరిగినా జరగవచ్చు.
ఈ మ్యాచ్ విషయానికొస్తే నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో టీమ్ఇండియా విన్నింగ్ కాంబినేషన్ కొనసాగించనుంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్యాదవ్, అక్షర్, జడేజా నలుగురు రాణిస్తే కప్ మన ఖాతాలో చేరినట్లే. కెప్టెన్ రోహిత్‌శర్మ, గిల్ ఫామ్ కలవరపరుస్తున్నా.. మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ నిలకడ జట్టుకు లాభిస్తున్నది. మెగాటోర్నీలో టాపార్డర్ విఫలమవుతూ వస్తున్నా..మిడిలార్డర్ బ్యాటర్లు జట్టును ఆదుకుంటున్నారు. కోహ్లీ, అయ్యర్‌కు తోడు అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా జత కలిస్తే కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. మొత్తంగా 12 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది.
ఐసీసీ టోర్నీల్లో టైటిళ్లు కివీస్‌ను ఊరిస్తూనే ఉన్నాయి. ప్రతీసారి మెగాటోర్నీల్లో సెమీస్, ఫైనల్ వరకు చేరుకుని ఉత్త చేతులతో వెనుదిరిగిన సందర్భాలు కోకొల్లలు. సరిగ్గా 24 ఏండ్ల క్రితం కెన్యాలో ఇదే భారత్‌పై ఫైనల్లో గెలిచిన న్యూజిలాండ్ తొలిసారి నాకౌట్ ట్రోఫీని గెలుచుకుంది. తిరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు కివీస్‌కు టైటిల్ కల కలగానే మిగిలింది. కాలం గడుస్తున్నా..వారి అదృష్ట రేఖలు మాత్రం మారడం లేదు. ఈసారి ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన కివీస్..తమ తొలి పోరులోనే ఆతిథ్య పాకిస్థాన్‌ను ఓడించింది. బంగ్లాదేశ్‌పై భారీ విజయమందుకున్న కివీస్..భారత్ చేతిలో కంగుతిన్నది. కీలకమైన సెమీస్‌లో సఫారీలను వేటాడి భారత్‌తో ఫైనల్‌కు అర్హత సాధించింది. బ్యాటింగ్ పరంగా రచిన్ రవీంద్ర, విలియమ్సన్ సూపర్ ఫామ్ మీదుండటం కివీస్‌కు కలిసి వచ్చే అంశం. మిడిలార్డర్లో మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్ నిలకడలేమి ఆందోళన కల్గిస్తున్నది. బౌలింగ్ విషయానికొస్తే..హెన్రీ తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నగా మారగా, కెప్టెన్ సాంట్నర్, బ్రేస్‌వెల్ తమ స్పిన్ జోరు కొనసాగిస్తున్నారు. వీరికి రచిన్, ఫిలిప్స్ జత కలిస్తే తిరుగుండదు.
దుబాయ్ పిచ్ ఒకింత స్లోగా స్పందించే అవకాశముంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుని ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచే చాన్స్ ఉంది. మంచు కురిసే అవకాశం లేకపోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్ బౌలింగ్‌కు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు.
భారత్: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయాస్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, కుల్దీప్, షమీ, వరుణ్.
న్యూజిలాండ్: యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, సాంట్నర్(కెప్టెన్),
జెమీసన్, హెన్రీ/డఫీ/స్మిత్, రూర్కీ.
జత కలిస్తే ఇంకా బాగుంటుంది
12 గత 14 ఐసీసీ టోర్నీల్లో 12 సార్లు భారత్ నాకౌట్‌కు అర్హత సాధిస్తే అందులో మూడింటిలో గెలిచింది.
కోహ్లీ మరో 45 పరుగులు సాధిస్తే..చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన గేల్‌ను దాటేస్తాడు.
1-3 ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్ నాలుగు సార్లు తలపడితే, కేవలం ఒకే సారి గెలిచింది. వన్డే వరల్డ్ కప్(2023) సెమీస్‌లో టీమ్ఇండియా గెలుపు ఖాతాలో వేసుకుంది.