బెంగళూరు: భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం నుంచి మొదలు కావాల్సిన తొలి టెస్టుకు అందరూ అనుకున్నట్టుగానే వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించాడు. గత రెండ్రోజులుగా బెంగళూరులో జోరుగా కురుస్తున్న వాన.. తొలి టెస్టులో టాస్ కూడా పడనివ్వకుండా అడ్డుకుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ కురిసిన వర్షంతో మొదటి రోజు టాస్ పడకుండానే ఆట రైద్దెంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మ్యాచ్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. బెంగళూరుకు గురువారమూ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రెండో రోజూ ఆట సాగడం అనుమానంగానే ఉంది.
మంగళవారం ఉదయం నుంచే బెంగళూరులో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ఉదయం 10:30 గంటలకు వరుణుడు కొద్దిసేపు తెరిపినిచ్చినా మరో అరగంటకు అదే కథ పునరావృతమైంది. తొలి సెషన్ ముగిశాక మరోసారి వాన ఆగడంతో గ్రౌండ్ సిబ్బంది ప్రధాన పిచ్‌పై కవర్లను తొలిగించే యత్నం చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ నిర్వాహకులు ఔట్ ఫీల్డ్‌ను పరిశీలించేందుకు వచ్చి కాసేపు మైదానం అంతా కలియతిరిగారు. ఇదే సమయంలో కోహ్లీ, జైస్వాల్ మైదానంలోకి వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేశారు. కానీ కొద్దిసేపటికే మళ్లీ కుండపోత వర్షం కురవడంతో మధ్యాహ్నం 2.34 గంటలకు తొలి రోజు ఆటను రద్దుచేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. వర్షం కురవకుంటే మైదానాన్ని ఆరబెట్టేందుకు చిన్నస్వామిలో అత్యాధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ వరుణుడు పదే పదే అంతరాయం కలిగించడంతో తొలి రోజు ఆట సాగలేదు.
తొలి రోజు ఆట వర్షార్పణమైన నేపథ్యంలో రెండో రోజు 15 నిమిషాల ముందే మ్యాచ్ ఆరంభం కానుంది. వరుణుడు కరుణిస్తే ఉదయం 8.45 గంటలకు టాస్ వేయనుండగా తొలి సెషన్ 9.15 నుంచి 11.30 వరకు సాగనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 12.10 గంటలకు మొదలై 2.45 దాకా ఉండనుంది. మూడో సెషన్‌ను మధ్యాహ్నం 2.45 నుంచి సాయంత్రం 4.45 దాకా ఆడించనున్నారు.