తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపించిన టీమ్ఇండియా.. మలి పోరుకు సిద్ధమైంది. పేసర్లు రాణించడంతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసిన రోహిత్ సేన.. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న హాంకాంగ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. పాక్‌తో పోరులో కాస్త తడబడి ఆ తర్వాత పుంజుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో ప్రయోగాలకు పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. టాపార్డర్ గాడిన పడేందుకు ఇది సువర్ణావకాశం కాగా.. స్టార్లతో నిండిన టీమ్ఇండియాతో తలపడటమే హాంకాంగ్‌కు పెద్ద విజయం కానుంది.
దుబాయ్: దాయాదిపై విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమ్ఇండియా.. ఆసియా కప్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో తలపడేందుకు రెడీ అయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా.. హాంకాంగ్‌తో పోల్చుకుంటే భారత్ బలంగా కనిపిస్తుండగా.. క్వాలిఫయింగ్ టోర్నీలో పట్టుదల కనబర్చిన హాంకాంగ్.. రోహిత్ సేనకు కనీస పోటీనివ్వాలని తహతహలాడుతున్నది. పాకిస్థాన్‌తో పోరులో బౌలర్లు ఆకట్టుకున్నా.. భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం కాస్త ఆందోళనకు గురిచేసింది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు మనవాళ్లు చివరి ఓవర్ వరకు ఆడాల్సి వచ్చింది.
మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్‌తో జట్టును గెలిపించాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు.. బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్‌పై మరోసారి జట్టు భారీ అంచనాలు పెట్టుకోగా.. గత మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన వైస్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ ఈసారైనా రాణిస్తాడా చూడాలి. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పాక్‌తో పోరులో పర్వాలేదనిపించగా.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయారు. ఈ మెగాటోర్నీలో మనజట్టు మరోమారు పాకిస్థాన్‌తో తలపడే అవకాశాలుండటంతో టీమ్ఇండియా లోపాలను సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్‌ను వినియోగించుకోవాలనుకుంటున్నది. గత మ్యాచ్‌లో పంత్‌ను కాదని దినేశ్ కార్తీక్‌కు తుదిజట్టులో చోటివ్వగా.. అదే కొనసాగిస్తారా లేక పంత్‌కు అవకాశామిస్తారో తేలాల్సి ఉంది.
టాపార్డర్‌లో ఎడమచేతి వాటం ఆటగాళ్లు లేకపోవడంతో నాకు బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వెళ్లే అవకాశం వస్తుందని ముందే ఊహించా.. అందుకు నన్ను నేను సిద్ధం చేసుకున్నా. పొట్టి ఫార్మాట్లో క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం దొరకదు. పరిస్థితులను ఆకలింపు చేసుకొని వెంటనే పని మొదలుపెట్టాలి. కొన్ని సార్లు బాగా బౌలింగ్ చేసినా వికెట్లు దక్కవు. పాక్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ యూనిట్ మెరుగ్గా రాణించింది. హాంకాంగ్‌ను తేలికగా తీసుకోవడం లేదు. టీ20ల్లో తమదైన రోజు ఎంత చిన్న జైట్టెనా.. చాంపియన్లకు షాకిస్తుంది. -రవీంద్ర జడేజా