భారత్, ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-అండర్సన్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. తొలి టెస్టులో గెలిచే అవకాశాలున్నప్పటికీ చేజేతులా వదిలిపెట్టుకుని సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమ్ఇండియా.. రెండో టెస్టుతో పుంజుకోవాలని చూస్తున్నది. సిరీస్‌లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన రెండో టెస్టులో తప్పులకు ఫుల్స్టాప్ పెడుతూ ఇంగ్లండ్‌కు దీటైన పోటీనిచ్చేందుకు భారత్ పావులు కదుపుతున్నది. రెండో టెస్టులో స్టార్ పేసర్ బుమ్రా ఆడేది లేనిది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అంతగా అచ్చిరాని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ చరిత్ర తిరుగరాస్తుందా లేక ఇంగ్లండ్‌కు మరో మ్యాచ్ కోల్పోతుందా అనేది త్వరలో తేలనుంది.
బర్మింగ్‌హామ్: ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టులో తలపడబోతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో రికార్డు విజయంతో ఆతిథ్య ఇంగ్లండ్ మంచి ఊపుమీదుంటే.. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్న టీమ్ఇండియా ఒకింత ఒత్తిడిలో ఉంది. సిరీస్‌లో ఎలాగైనా నిలదొక్కుకోవాలని చూస్తున్న భారత్ అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తున్నది. లీడ్స్ టెస్టు ముగిసిన వెంటనే బర్మింగ్‌హామ్‌కు పయనమైన గిల్‌సేన కఠోరమైన ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ 20 వికెట్లు పడగొట్టేందుకు పలు రకాల కూర్పులపై కసరత్తు చేస్తున్నది. తొలి టెస్టు తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు చీఫ్ కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. జడేజాకు జతగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్ను ఆడించాలా లేక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవాలా అన్నది ఆలోచిస్తున్నది. మొదటి టెస్టులో అంచనాలు అందుకోలేకపోయిన శార్దుల్ ఠాకూర్‌కు బదులుగా తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి రాక దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇస్తాడని అనుకున్నా.. ఎలాంటి మార్పుల్లేకుండానే తొలి టెస్టు జట్టుతోనే ఇంగ్లండ్ బరిలోకి దిగుతున్నది.
తుది కూర్పుపై సందిగ్ధత : దిగ్గజాల గైర్హాజరీలో పరివర్తన దశ ఎదుర్కొంటున్న టీమ్ఇండియా..ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో శుభారంభం కోసం అన్ని రకాల అస్త్రశస్ర్తాలతో సిద్ధమవుతున్నది. లీడ్స్ టెస్టులో బ్యాటర్లు పరుగుల వరద పారించినా..బౌలర్ల వైఫల్యంతో రికార్డు ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. బుమ్రా మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోవడంతో టీమ్ఇండియా పరాజయం వైపు నిలువాల్సి వచ్చింది. సిరీస్‌లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న టీమ్ఇండియాను తుది కూర్పు కలవరపెడుతున్నది. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల ఫార్ములాతో బరిలోకి దిగేందుకు పావులు కదుపుతున్నది. అయితే ఇద్దరు స్పిన్నర్లలో జడేజా-కుల్దీప్, జడేజా-సుందర్, కుల్దీప్-సుందర్ కాంబినేషన్లో దేనికి మొగ్గుచూపాలనే దానిపై ఆలోచన చేస్తున్నది. ఆల్‌రౌండర్ కోటాలో శార్దుల్ స్థానంలో నితీశ్ బెర్తు దాదాపు ఖరారు కాగా, బుమ్రా ఆడకపోతే అతనికి బదులుగా అర్ష్‌దీప్‌సింగ్ లేక ఆకాశ్‌దీప్‌లో ఒకరిని బరిలోకి దింపవచ్చు. బ్యాటింగ్ విషయానికొస్తే తొలి టెస్టులో విఫలమైన సాయి సుదర్శన్, కరణ్ నాయర్‌కు మరో చాన్స్ దక్కనుంది. ఇంతకుమించి మార్పులేమి ఉండకపోవచ్చు.
ఆర్చర్ మిస్ : నాలుగేండ్ల తర్వాత తిరిగి జట్టులోకి వస్తాడనుకున్న ఆర్చర్ వ్యక్తిగత కారణాలతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో తొలి టెస్టు జట్టునే తిరిగి కొనసాగించేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది. క్రిస్ వోక్స్, బ్రెండన్ కార్స్, జోష్ టంగ్‌కు జతగా కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఏకైక స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ కొనసాగనున్నాడు. టాపార్డర్‌లో బెన్ డకెట్, ఒలీ పోప్, బ్రూక్, రూట్ మంచి టచ్‌లో ఉండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం కానుంది.
0 ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటి వరకు 8 టెస్టులాడిన భారత్ ఏడింటిలో ఓడి ఒక డ్రా చేసుకోగా ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది.
భారత్: జైస్వాల్, రాహుల్, సుదర్శన్, గిల్(కెప్టెన్), పంత్, కరణ్నాయర్, జడేజా, కుల్దీప్/సుందర్, బుమ్రా/అర్ష్‌దీప్/ఆకాశ్, సిరాజ్, ప్రసిద్ధ్.
ఇంగ్లండ్: క్రాలీ, డకెట్, పోప్, బ్రూక్, రూట్, స్టోక్స్(కెప్టెన్), స్మిత్, వోక్స్, కార్స్, టంగ్, బషీర్.