మెల్బోర్న్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆతిథ్య జట్టుదే పైచేయి. స్టీవ్ స్మిత్ (197 బంతుల్లో 140, 13 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకానికి తోడు కెప్టెన్ పాట్ కమిన్స్ (49) మెరుపులతో తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలు 474 పరుగుల భారీ స్కోరు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (118 బంతుల్లో 82, 11 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లీ (86 బంతుల్లో 36, 4 ఫోర్లు) రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యంతో కుదురుకున్నట్టే కనిపించినా చివర్లో అనవసర తప్పిదాలతో వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ (6 నాటౌట్), రవీంద్ర జడేజా (4 నాటౌట్) క్రీజులో ఉండగా నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మాత్రమే బ్యాటింగ్ చేయగల సమర్థులు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఏ మేరకు ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గిస్తుందనేది ఆసక్తికరం.
రెండో రోజు లంచ్ తర్వాత కొద్దిసేపటికే ఆసీస్‌ను ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చీ రాగానే షాక్ తగిలింది. గత రెండు మ్యాచ్‌లలో మిడిలార్డర్లో వచ్చి విఫలమైన సారథి రోహిత్ శర్మ (3).. మెల్బోర్న్లో ఓపెనింగ్ చేసినా అతడి బ్యాటింగ్‌లో మార్పు రాలేదు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో ఆఖరి బంతిని పుల్‌షాట్ ఆడబోయిన హిట్‌మ్యాన్ మిడాన్ వద్ద బొలాండ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 24, 3 ఫోర్లు).. జైస్వాల్‌తో కలిసి ఆసీస్ బౌలర్లను అడ్డుకున్నాడు. క్రీజులో కుదురుకుంటున్న రాహుల్.. సరిగ్గా టీ విరామానికి ముందు కమిన్స్ వేసిన 15వ ఓవర్లో ఆఖరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీకి జతకలిసిన జైస్వాల్.. ఆసీస్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. కోహ్లీ కూడా ఆరంభంలో ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతులను వెంటాడటం మానుకుని డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చాడు. ఆసీస్ బౌలర్లు పదే పదే అటువైపుగా బంతులేసినా ఏకాగ్రత కోల్పోలేదు. స్టార్క్ వేసిన 29వ ఓవర్లో 4, 3తో 81 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. క్రమంగా క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యం (102) పూర్తిచేసుకుని సాఫీగా సాగుతున్న ఈ జోడీ సమన్వయ లోపంతో వికెట్లను కోల్పోయింది. చివరి సెషన్లో మరో అరగంట అయితే ఆట ముగుస్తుందనగా బొలాండ్ 41వ ఓవర్లో చివరి బంతికి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. అతడే వేసిన మరుసటి ఓవర్లో కోహ్లీ.. మళ్లీ ఆఫ్‌స్టంప్ ఆవల బంతిని ఆడబోయి కీపర్ కేరీకి క్యాచ్ ఇచ్చాడు. ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యాడు.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 311/6తో రెండో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా.. తొలి రోజు దూకుడునే కొనసాగించింది. 68 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆడిన స్మిత్.. కమిన్స్ అండగా రెచ్చిపోయాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 90లలోకి వచ్చిన అతడు.. నితీశ్ రెడ్డి ఓవర్లో ఫోర్ కొట్టి తన టెస్టు కెరీర్లో 34వ శతకాన్ని పూర్తిచేశాడు. మెల్బోర్న్లో అతడికి ఇది ఐదో టెస్టు శతకం. సెంచరీ తర్వాత స్మిత్.. టీ20 మోడ్‌లోకి మారాడు. అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో కమిన్స్ నిష్క్రమించినా స్మిత్ జోరు తగ్గలేదు. తొలి సెషన్లో ఆసీస్ 27 ఓవర్లలోనే 5.29 సగటుతో 143 పరుగులు రాబట్టింది. అయితే లంచ్ తర్వాత మొదటి ఓవర్లోనే జడేజా.. మిచెల్ స్టార్క్ (15)ను ఔట్ చేశాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన స్మిత్.. దురదృష్టవశాత్తూ బౌల్డ్ అయ్యాడు.
ఆస్ట్రేలియా: 474 ఆలౌట్ (స్మిత్ 140, లబూషేన్ 72, బుమ్రా 4/99, జడేజా 3/78); 46 ఓవర్లలో 164/5 (జైస్వాల్ 82, కోహ్లీ 36, బొలాండ్ 2/24, కమిన్స్ 2/57)