KL Rahul | మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటన కంటే ముందే అక్కడకు వెళ్లిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. గురువారం నుంచి ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఆసీస్ ‘ఏ’తో జరుగబోయే అనధికారిక రెండో టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఈనెల 22 నుంచి కంగారూలతో తొలి టెస్టు జరగాల్సి ఉండగా ఆ మ్యాచ్‌కు సారథి రోహిత్ శర్మ అందుబాటులో ఉండేది అనుమానమేనన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో యశస్వీ జైస్వాల్‌కు జంటగా రాహుల్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే రాహుల్‌ను ముందుగానే ఆస్ట్రేలియాకు పంపిన మేనేజ్మెంట్.. గురువారం మ్యాచ్‌లో అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించే బాధ్యతలను రాహుల్‌కు అప్పజెప్పినట్టు సమాచారం. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో విఫలమైన రాహుల్.. న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టులో ఆడినా ఆ మ్యాచ్‌లో విఫలమై తర్వాతి రెండు టెస్టులకూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఈ నేపథ్యంలో అనధికారిక టెస్టులో అతడు ఏ మేరకు రాణించగలడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్‌గా రావడం రాహుల్‌కు కొత్తేం కాదు. 2015-23 మధ్యకాలంలో 75 ఇన్నింగ్స్‌లలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్.. 34.94 సగటుతో 2,551 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్‌తో పాటు ధ్రువ్ జురెల్ కూడా ఆస్ట్రేలియా పయనమవగా తొలి మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కున్న ఇషాన్ కిషన్ స్థానంలో అతడిని ఆడించే అవకాశాలున్నాయి.
ఆసీస్ ‘ఏ’తో వామప్ మ్యాచ్ కోసం భారత్ ‘ఏ’ మార్పులు, చేర్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తున్నది. బుధవారం ఎమ్‌సీజీలో జరిగిన నెట్ ప్రాక్టీస్లోరాహుల్ మంచి టచ్మీద కనిపించాడు. బాబా ఇంద్రజిత్ స్థానంలో రాహుల్ జట్టులోకి రానున్నాడు. మకాయ్లో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో ఇంద్రజిత్ 9, 6 స్కోర్లతో తీవ్రంగా నిరాశపరిచాడు.
దీనికి తోడు పేస్, బౌన్సీ పిచ్‌లపై 125కి.మీ వేగంతో కూడిన బంతులను ఆడటంలో ఇంద్రజిత్ తడబడ్డాడు. ఇషాన్ కిషన్‌కు బదులుగా జురెల్ రాక ఖరారు కాగా, పేసర్ సైనీ స్థానంలో ఖలీల్ తుది జట్టులో ఆడనున్నాడు. పెర్త్(22 తేదీ) పోరుకు ముందు భారత్ ‘ఏ’కు ఇది కీలకం కానుంది.