ఇండియా తమ చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. సంపూర్ణ ఆధిపత్యంతో అఫ్గాన్‌పై ఇప్పటికే సిరీస్ గెలిచిన రోహిత్ సేన.. క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. దూబే, జైస్వాల్, రింకూ దంచికొడుతుండగా.. రోహిత్ మెరుపుల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
బెంగళూరు: ఇప్పటికే అఫ్గానిస్థాన్‌పై పొట్టి సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు.. ఇక క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమ్ఇండియా చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన రోహిత్ సేన బుధవారం అఫ్గాన్‌తో ఆఖరి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. పొట్టి ఫార్మాట్లో యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలివ్వగా.. వాళ్లు వాటిని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నారు.
శివమ్ దూబే, జితేశ్ శర్మ, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ గత రెండు మ్యాచ్‌ల్లో రాణించగా.. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఎటొచ్చి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరే టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. ఎప్పుడూ లేని విధంగా హిట్‌మ్యాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం అతడిపై ఒత్తిడి పెంచుతుందనడంలో సందేహం లేదు.
వరల్డ్‌కప్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లకు ఈ మ్యాచ్ అనంతరం ఇక ఐపీఎల్ మాత్రమే అందుబాటులో ఉంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలోకి దింపుతారా లేక.. రిజర్వ్ బెంచ్‌ను పరీక్షిస్తారా చూడాలి. మరోవైపు స్పిన్ ఆయుధంగా బరిలోకి దిగిన అఫ్గాన్.. భారత జట్టుకు సరైన పోటీనివ్వలేకపోయింది. మరి ఆఖరి పోరులోనైనా కాబూలీలు సత్తాచాటుతారా చూడాలి.