T20 World Cup | బార్బడోస్: పొట్టి ప్రపంచకప్‌లో గ్రూప్ దశను విజయవంతంగా ముగించిన భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి కీలకమైన సూపర్-8 సవాల్‌కు సిద్ధమవుతోంది. వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగబోయే తొలి పోరుకు రోహిత్ సేన అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంది.
లీగ్ దశలో అంచనాలకు మించి రాణించిన అఫ్గాన్.. పటిష్టమైన బౌలింగ్ యూనిట్‌తో ‘మెన్ ఇన్ బ్లూ’కు షాకిచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో భారత్‌కు విజయం అంత సులువు అయితే కాదు. న్యూయార్క్‌లో పేస్‌కు అనుకూలించిన ‘డ్రాప్ ఇన్ పిచ్’పై ఆడిన భారత్.. సూపర్ 8లో దానికి పూర్తి భిన్నంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే కరీబియన్ గడ్డమీద ఆడనుండటంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.
అందరి కండ్లూ కోహ్లీపైనే..
ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ దారుణంగా విఫలమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1,4,0).. సూపర్-8 దశలో అయినా ఫామ్‌లోకి రావాలని భారత్ కోరుకుంటోంది. రోహిత్‌శర్మతో ఓపెనర్‌గా వస్తున్న కోహ్లీ.. సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఆ భారం తీవ్రంగా పడుతోంది. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లపై భారత్.. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్యాదవ్ను తుది జట్టులో ఆడించే అవకాశాలున్నాయి.
కుల్దీప్ ఫైనల్ లెవన్‌లో ఉంటే సిరాజ్/అర్ష్‌దీప్‌లో ఎవరో ఒకరు బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వస్తుంది. పేస్ బాధ్యతలు బుమ్రా మోయనుండగా.. జడేజా, అక్షర్, హార్దిక్, దూబే రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉండటం భారత్‌కు కలిసిరానుంది. స్పిన్ బాగా ఆడగలిగే దూబేకు న్యూయార్క్ పిచ్ ఆ అవకాశమివ్వకపోయినా విండీస్ పిచ్‌లపై అతడు స్పిన్నర్లను ఎలా ఎదుర్కుంటాడనేది ఆసక్తికరంగా మారింది.
గత కొంత కాలంగా నిలకడైన ప్రదర్శనతో అగ్రశ్రేణి జట్లను సైతం వణికిస్తున్న అఫ్గాన్ ఫుల్ జోష్‌లో ఉంది. ఆ జట్టు పేసర్ ఫజల్హక్ ఫరూఖీ ఆరంభంలో కొత్త బంతితో నిప్పులు చెరుగుతుండగా మధ్య ఓవర్లలో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఒమర్జయ్ ప్రత్యర్థిని కట్టడిచేస్తున్నారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. టోర్నీలో అత్యధిక పరుగుల(గుర్బాజ్-167)తో పాటు వికెట్లు (ఫరూఖీ-12) తీసినవారిలో అఫ్గాన్ ప్లేయర్లే ఉండటం గమనార్హం. భారత్ ఏమాత్రం ఆదమరిచినా ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టేందుకు రషీద్ ఖాన్ గ్యాంగ్ రెడీగా ఉంది.