సముద్రతీర నగరం ముంబైని అభిషేక్‌శర్మ సునామీ ముంచెత్తింది! చల్లని సాయంత్రం వేళ అప్పటి వరకు చల్లని గాలులతో ప్రశాంతంగా కనిపించిన అరేబియా సముద్రతీర ప్రాంతం అభిషేక్ బౌండరీలతో ఊహించని రీతిలో పోటెత్తింది. వాంఖడే వేదికగా ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ ఈ పంజాబ్ పుత్తర్ కొట్టిన కొట్టుడుకు రికార్డులు సలామ్ కొట్టాయి. సింగిల్స్‌తో పిల్ల కాలువలా మొదలైన ప్రవాహం ఊహించని రీతిలో ఫోర్లు, భారీ సిక్స్‌లతో ఉప్పెనలా విరుచుకుపడింది. ఈ హఠాత్ పరిణామం నుంచే తేరుకునే అవకాశమివ్వని అభిషేక్ ధాటికి బౌండరీలు చిన్నబోయాయి. 37 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న ఈ యంగ్‌తరంగ్ భారత్ తరఫున టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. అభిషేక్ ధాటికి భారీ స్కోరు అందుకున్న టీమ్ ఇండియా.. ఇంగ్లండ్‌ను 97 పరుగులకే కుప్పకూల్చింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.
Team India | ముంబై : టీమ్ ఇండియా నయా సంచలనం అభిషేక్‌శర్మ మరోమారు జూలు విదిల్చాడు. తనలో విధ్వంసక ప్లేయర్‌ను తట్టిలేపుతూ ఇంగ్లండ్‌పై విరుచుకుపడ్డాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఓపెనర్ అభిషేక్‌శర్మ(54 బంతుల్లో 135, 7ఫోర్లు, 13సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో టీమ్ ఇండియా 20 ఓవర్లలో 247/9 స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ అభిషేక్ సునామీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. శివమ్‌దూబే(30), తిలక్‌వర్మ(24) ఆకట్టుకున్నారు. కార్స్(3/38), మార్క్‌వుడ్(2/32) రాణించారు. భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. షమీ అభిషేక్ దూబే వరుణ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. సాల్ట్(55) మినహా అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సూపర్ సెంచరీతో అదరగొట్టిన అభిషేక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, 14 వికెట్లు పడగొట్టిన వరుణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’దక్కాయి.
అభిషేక్ హోరు : తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కింది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ శాంసన్(16) మరోమారు నిరాశపరిచాడు. అయితే అభిషేక్ ఈసారి జట్టు బాధ్యతలను భుజానేసుకున్నాడు. తన మెంటార్ యువరాజ్‌సింగ్ శైలిని పుణికిపుచ్చుకున్న ఈ పంజాబీ బ్యాటర్ ఇంగ్లండ్ బౌలర్లను దునుమాడాడు. మొదట సింగిల్స్‌కే మొగ్గుచూపిన శర్మ.. ఆ తర్వాత బౌండరీలతో చెలరేగాడు. ఆర్చర్ వేసిన 3వ ఓవర్లో మొదలైన ఈ చిచ్చరపిడుగు జోరు ఆఖరి దాకా కొనసాగింది. ఆర్చర్‌ను ఓ ఫోర్, రెండు సిక్స్‌లు అరుసుకున్న అభిషేక్ ఆ తర్వాత వుడ్, ఓవర్టన్ పనిపట్టాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. మరో ఎండ్‌లో తిలక్ జత కలువడంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ 95 పరుగులు చేసింది. ఓవైపు తిలక్ ఔటైనా అభిషేక్ జోరు ఏమాత్రం తగ్గలేదు. బౌలర్‌తో సంబంధం లేకుండా బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న శర్మ 37 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రేక్షకులకు పసందైన విందు అందించిన అభిషేక్ తనదైన శైలిలో అభివాదం చేశాడు. సెంచరీ తర్వాత..దూకుడు తగ్గినా పరుగుల రాక మందగించలేదు.
7 అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అభిషేక్‌శర్మ(135)ది అత్యుత్తమ స్కోరు. గిల్(126*) రికార్డును అభిషేక్ దాటేశాడు.
భారత్: 20 ఓవర్లలో 247/9(అభిషేక్ 135, దూబే 30, కార్స్ 3/38, వుడ్ 2/32),
ఇంగ్లండ్: 10.3 ఓవర్లలో 97 ఆలౌట్ (సాల్ట్ 55, బెతెల్ 10, షమీ 3/25, అభిషేక్ 2/3)