India Squad For T20 World Cup | వచ్చే ఏడాది భారత్-శ్రీలంక వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగనున్నది. ఈ సారి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భారత జట్టు భావిస్తున్నది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం టీ20 ప్రపంచ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రధాన కార్యాలయంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో జట్టును ఎంపిక చేసింది. ఇదే జట్టు జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా ఆడనుంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ఈ టోర్నమెంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. ఈ ఇది టోర్నమెంట్ 10వ ఎడిషన్. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాయి. సొంత గడ్డపై ఈ రికార్డును బద్దలు కొట్టాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉన్నది. టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. మొన్నటి వరకు వైస్ కెప్టెన్‌గా కొనసాగిన గిల్ స్థానంలో అక్షర్ పటేల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఫామ్ లేమితో గిల్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, రింకు సింగ్ జట్టులోకి తిరిగి వచ్చారు. ఇషాన్ చివరిగా 2023 నవంబర్ 28న ఆస్ట్రేలియాపై భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఇషాన్ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ అక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. పర్యటన మధ్యలోనే ఇషాన్ తిరిగి స్వదేశానికి వచ్చాడు. దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాడన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. తాజాగా రెండేళ్ల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. రింకు సింగ్ చివరిసారిగా ఆసియా కప్‌లో ఆడాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం చోటు దక్కలేదు. శుభ్‌మన్ గిల్ స్థానంలో అక్షర్ పటేల్‌ను టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు. అక్షర్ గతంలో కూడా టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
వాస్తవానికి ఈ సారి ఎవరూ ఊహించని విధంగా ఇషాన్ కిషన్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కిషన్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో 101 పరుగులు చేశాడు. టోర్నమెంట్ మొత్తం అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఇషాన్ చేరికతో జితేష్ శర్మ చోటు కోల్పోయాడు. సంజు శాంసన్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తాడు. జట్టును ప్రకటించే సమయంలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ సంజు శాంసన్ వికెట్ కీపర్‌గా కొనసాగుతాడని తెలిపాడు. గిల్ జట్టులో లేకపోవడంతో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. శాంసన్, అభిషేక్ ఓపెనింగ్ జోడీ అద్భుతంగా ఉంటుంది. గతంలో ఇద్దరు ఓపెనర్లుగా వచ్చి పరుగుల వరద పారించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదవ టీ20లోనూ ఇదే దృష్యం కనిపించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఐసీసీ వేదికలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబయిలో యూఎస్ఏతో ఆడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న నమీబియాతో ఢిల్లీలో ఆడుతుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని భారీ నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి.

T20 Worlcup2026