India Squads | కొత్త ఏడాదిలో భారత్-శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగనున్నది. అదే సమయంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లో భారత జట్టు తలపడనున్నది. ప్రపంచకప్, న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం సమావేశం కాబోతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాబోయే బిజీ షెడ్యూల్ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేసేందుకు ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో జట్టును.. అంతకంటే ముందు న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయడంపై సెలక్షన్ కమిటీ దృష్టి సారించనున్నది.
సెలక్షన్ కమిటీ ప్రస్తుతం ఉన్న జట్టును కొనసాగించేందుకే మొగ్గు చూపుతుంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన టీ20 జట్టునే ప్రపంచకప్‌లో ఆడించే అవకాశం ఉంది. జట్టులో పెద్దగా ఊహించని మార్పులు ఏవీ ఉండవని భావిస్తున్నారు. 15 మంది సభ్యుల జట్టును ఐసీసీకి ముందుగానే సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. టోర్నీ మొదలయ్యే సమయానికి ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఎవరైనా ఆటగాళ్లు గాయాల బారినపడినా.. ఫామ్‌లో గణనీయమైన మార్పులు ఎదురైనా ఎదుర్కొనేందుకు టీమ్ మేనేజ్మెంట్కు కొంత వెసులుబాటును కల్పిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సైతం ఆతిథ్యం ఇస్తుంది. ఇరు జట్లు జనవరి 11 నుంచి 31 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడుతాయి. టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరిలో మొదలవుతుంది. టీమిండియా తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబయిలో యూఎస్ఏతో ఆడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న నమీబియాతో ఢిల్లీలో ఆడుతుంది. ఆ తర్వాత గ్రూప్ దశలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని భారీ నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ప్రపంచకప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌తో పాటు పలువురు ఆటగాళ్ల ఫామ్‌పై ఆందోళన కొనసాగుతున్నది. టీ20 సారథి సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. నిలకడగా పరుగులు లేయలేకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. బ్యాట్‌తో పరుగులు చేయలేకపోయినా కెప్టెన్‌గా రికార్డు బాగుంది. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో జట్టును నడిపించేందుకు బీసీసీఐ, సెలక్షన్ కమిటీ సూర్యపైనే నమ్మకం ఉంచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానం ప్రశ్నార్థకంగా ఉంది. ప్రపంచకప్ జట్టులో చోటుపై అనిశ్చితి కొనసాగుతున్నది. గిల్ టెస్టులు, వన్డే ఫార్మాట్లో సారథిగా కొనసాగుతున్నప్పటికీ.. టీ20లో మాత్రం పెద్ద స్కోర్ లేయలేక ఇబ్బందిపడుతున్నాడు. దాంతో జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం, సంజు శాంసన్‌తో పాటు పలువురు యువ ఆటగాళ్ల గిల్ పోటీని ఎదుర్కొంటున్నాడు. గిల్ ఫామ్ మెరుగుపడకపోతే 2024 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అత్యద్భుతంగా రాణించిన యశ్వసీ జైస్వాల్ అతని స్థానంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.