IND vs AUS T20I: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా.. స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. నవంబర్ 23 నుంచి ఈ సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో జట్టు సెలక్షన్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు సీనియర్లకు ఈ సిరీస్‌కు విశ్రాంతినివ్వనుండటంతో పాటు గత ఏడాది కాలంగా టీ20లలో భారత్‌ను నడిపిస్తున్న హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఈ సిరీస్ లో ఎంపిక కాబోయే ఆటగాళ్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం భారత జట్టు వన్డే వరల్డ్ కప్‌లో బిజీబిజీగా గడుపుతోంది. ఇప్పటివరకూ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిదింటికీ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది. భారత్.. నవంబర్ 15న న్యూజిలాండ్‌తో ముంబైలోని వాంఖెడే వేదికగా సెమీస్ ఆడాల్సి ఉంది. సెమీఫైనల్స్ ముగిసిన తర్వాతే ఆసీస్‌తో తలపడబోయే భారత జట్టు ఎంపిక ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంటే నవంబర్ 15 తర్వాత భారత జట్టు ప్రకటన ఉండనుంది.
కెప్టెన్సీ రేసులో..
హార్ధిక్ పాండ్యా గాయంతో ఈ సిరీస్‌లో భారత్‌ను నడిపించేదెవరు..? అన్న చర్చమొదలైంది. అసలే వచ్చే ఏడాది యూఎస్ఎ, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పట్నుంచే భారత యువ జట్టును రాటుదేల్చేందుకు సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. పాండ్యా గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ను సారథిగా ప్రకటించే అవకాశం ఉంది. సూర్యతో పాటు ఆసియా క్రీడలలో భారత్‌ను నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. సీనియర్ ఆటగాళ్లందరికీ రెస్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో తిలక్ వర్మ, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.