దుబాయ్: క్రికెట్ మైదానంలో పాకిస్థాన్‌ను చూడగానే చెలరేగిపోయే భారత్ మరోసారి దాయాదిపై పంజా విసిరింది. మహిళల ఆసియా కప్‌లో ఖతర్నాక్ బౌలింగ్‌తో చిరకాల ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ హ్యాట్రిక్ విజయం అందుకుంది. తెలుగమ్మాయి శ్రీచరణి (3/7)తో పాటు ప్రేమ రావత్ (3/9) దీప్తి శర్మ 2/5) స్పిన్ దెబ్బకు విలవిలలాడిన పాక్ టీ20ల్లో తమ అత్యల్ప స్కోరు నమోదు చేసి చిత్తయింది.
శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన గ్రూప్-ఏ పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. వరుసగా మూడో విక్టరీతో సెమీఫైనల్‌కు సిద్ధమైంది. భారత స్పిన్నర్ల దెబ్బకు పాక్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు షవాల్ జుల్ఫికర్ (14), మునీబా అలీ (13) టాప్ స్కోరర్లు. ఆ జట్టులో తొమ్మిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అనంతరం చిన్న లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (18 నాటౌట్) రాణించింది. శ్రీచరణికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్‌లోనూ పాక్ క్రికెటర్లతో భారత్ కరచాలనం చేయలేదు.
చరణి మ్యాజిక్
తమ 200 టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను సానుకూలంగా ప్రారంభించినా తర్వాత భారత స్పిన్నర్ల దెబ్బకు బోల్తా కొట్టింది. ఓపెనర్లు మునీబా అలీ, షవాల్ జుల్ఫికర్ తొలి వికెట్‌కు 27 పరుగులు జోడించి క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశారు. కానీ, తొలి బౌలింగ్ మార్పుగా ఐదో ఓవర్లో బంతిని అందుకున్న పార్ట్‌టైమ్ స్పిన్నర్ షెఫాలీ వర్మ.. ఓ ఫ్లాట్ డెలివరీతో మునీబాను క్లీన్ బౌల్డ్ చేసి ప్రత్యర్థిని తొలి దెబ్బకొట్టింది. అక్కడి నుంచి పాక్ మళ్లీ పుంజుకోలేకపోయింది.
ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన శ్రీచరణి పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఆరో ఓవర్లో తన రెండో బంతికే గుల్ ఫిరోజా (0)ను ఔట్ చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆరో బాల్‌కు జుల్ఫికర్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేను పాక్ 29/3తో ముగించింది. చరణి తర్వాతి ఓవర్లోనే ఆయెషా (2) కెప్టెన్ హర్మన్‌కు క్యాచ్ ఇచ్చింది. ఆపై ప్రేమ, దీప్తి శర్మ దాడి మొదలైంది. రెండు బంతుల తేడాలో షమాస్ (3) ప్రేమ బౌల్డ్, భారీ అంచనాలున్న కెప్టెన్ ఫాతిమా సనా (0)ను దీప్తి ఎల్బీగా వెనక్కుపంపడంతో పాక్ 36/6తో దిక్కుతోచని స్థితిలో నిలిచింది.
తర్వాతి మూడు ఓవర్లలో వికెట్ కాపాడుకున్నా.. దీప్తి వేసిన 14వ ఓవర్లో ఈమన్ ఫాతిమ (5) రనౌట్ రూపంలో దాయాది జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. నందని పట్టిన క్యాచ్‌తో ఉమ్ హాని (5)ని పెవిలియన్ చేర్చిన ప్రేమ తన తర్వాతి ఓవర్లోనే నష్రా సంధు (0)ను డకౌట్ చేసింది. ఒంటరి పోరాటం చేస్తున్న తుబా హసన్ (9)ను 19వ ఓవర్ తొలి బంతికే దీప్తి స్టంపౌట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.
52 బంతుల్లోనే…
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోయినా 52 బంతుల్లోనే విజయం అందుకుంది. ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టిన ఓపెనర్ షెఫాలీ వర్మ (12) రెండో ఓవర్లో ఫాతిమా సనాకు బౌండరీతో స్వాగతం పలికింది. కానీ తర్వాతి బంతికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరింది. వన్‌డౌన్ బ్యాటర్ ప్రతీక (4)మరోసారి నిరాశ పరిచింది. అదే ఓవర్లో మునీబాకు క్యాచ్ ఇచ్చింది. రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (9)ను నాలుగో ఓవర్లో ఎల్బీ చేసిన సనా భారత్‌ను 29/3తో నిలిపింది. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ ఇవ్వకుండా పాక్ బౌలర్లు టీమిండియా విజయాన్ని ఆలస్యం చేసే ప్రయత్నం చేశారు. కానీ, నష్రా బౌలింగ్‌లో దీప్తి (12 నాటౌట్) ఫోర్ కొట్టగా.. ఆమె తర్వాతి ఓవర్లోనే వరుసగా 4, 6 బాదిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మ్యాచ్‌ను ముగిచింది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 18.1 ఓవర్లలో 55 ఆలౌట్ (షవాల్ 14, మునీబా అలీ 13, శ్రీ చరణి 3/7, ప్రేమ 3/9).
భారత్: 8.4 ఓవర్లలో 57/3 (హర్మన్‌ప్రీత్ 18 నాటౌట్, ఫాతిమా సనా 3/17)
55 టీ20ల్లో పాక్‌కు ఇదే లోయెస్ట్ స్కోరు. 2024లో ఇదే దుబాయ్ గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 56 రన్స్‌కు ఆలౌటైన అత్యల్ప స్కోరు తుడిచిపెట్టుకుపోయింది.
150 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఇది 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. పురుషుల, మహిళల టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.
3000 టీ20ల్లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ అతి పిన్న వయసులో (22 ఏండ్ల 220 రోజులు), అత్యంత వేగంగా (2182 బంతుల్లో) 3 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది.