అహ్మదాబాద్: మనకంటే అత్యంత తక్కువ ర్యాంకులు కల్గిన జట్ల చేతిలో సీనియర్ జట్టు ఓటములు, దేశీయంగా ఫుట్‌బాల్ ఆటపై నెలకొన్న స్తబ్ధత, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)పై కొనసాగుతున్న అనిశ్చితి వేళ భారత అండర్-17 ఫుట్‌బాల్ జట్టు సంచలనమే చేసింది. ఏఎఫ్సీ అండర్-17 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో యువ భారత్.. 2-1తో ఆసియా దిగ్గజం, మాజీ చాంపియన్ ఇరాన్‌కు షాకిచ్చింది.
వచ్చే ఏడాది టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో మన అబ్బాయిలు సత్తాచాటారు. 19వ నిమిషంలో అమీర్ రెజా గోల్ చేసి ఖాతా తెరవగా.. ప్రథమార్థం ముగియడానికి ముందు కెప్టెన్ పెనాల్టీని గోల్‌గా మలిచి భారత ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. 52వ నిమిషంలో గోల్ చేసిన ఇరాన్.. మ్యాచ్‌ను డ్రా చేయడానికి యత్నించినా భారత కుర్రాళ్లు ఆ అవకాశమివ్వలేదు. ఈ టోర్నీలో అర్హత సాధించడం భారత్‌కు ఇది పదోసారి.