ఎన్నో అనుమానాలు! అంతకుమించిన సందేహాలు! కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి దిగ్గజాల నిష్క్రమణ వేళ కఠినమైన ఇంగ్లండ్ పిచ్‌లపై అంతగా అనుభవం లేని టీమ్ఇండియా ఎలా ఆడబోతుందోనని..! కానీ తొలిటెస్టు మొదటిరోజే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ లీడ్స్ టెస్టులో యువ భారత్ అదరగొట్టింది. సారథ్య బాధ్యతలు అందుకున్న అరంగేట్ర టెస్టులోనే బ్యాటుతో శుభ్‌మన్ గిల్ అజేయ శతకంతో సత్తాచాటగా.. క్రీజులో కుదురుకుంటే మూడంకెల స్కోరు సాధించిగానీ పోరాటాన్ని ఆపని యోధుడు యశస్వీ జైస్వాల్ సెంచరీకి తోడు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధ శతకంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
హెడింగ్లీ: భారత టెస్టు జట్టు కొత్త సారథి శుభ్‌మన్ గిల్ (175 బంతుల్లో 127 నాటౌట్, 16 ఫోర్లు, 1 సిక్స్), యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (159 బంతుల్లో 101, 16 ఫోర్లు, 1 సిక్స్) శతక్కొట్టడంతో హెడింగ్లీలో ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో భారత్ మొదటి రోజే భారీ స్కోరు చేసింది. లీడ్స్ వేదికగా శుక్రవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. గిల్, జైస్వాల్ శతకాలకు తోడు రిషభ్ పంత్ (102 బంతుల్లో 65, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 42, 8 ఫోర్లు) రాణించడంతో తొలి రోజు మూడు సెషన్లలో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో రోజూ ఇదే ఆటను కొనసాగిస్తే మ్యాచ్‌పై గిల్ సేనకు పట్టుచిక్కినట్టే! ఇక బౌలింగ్‌లో అనుభవలేమితో ఇంగ్లండ్ పేసర్లు తొలిరోజు పూర్తిగా తేలిపోయారు. స్టోక్స్ (2/43) మినహా మిగిలిన పేసర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
ఆరంభమే అదుర్స్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు తాము ఎంత తప్పు చేశామో తెలియడానికి పెద్దగా సమయం పట్టలేదు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లేని లోటు ఆ జట్టులో.. స్పష్టంగా కనబడింది. సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్‌తో పాటు బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ తేలిపోవడంతో భారత ఓపెనర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. బౌండరీతో పరుగుల వేటను ఆరంభించిన జైస్వాల్, రాహుల్ ఇంగ్లిష్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. పూర్తిగా ఆఫ్‌సైడ్ ఆటతో అలరించిన ఈ ద్వయం 16 బౌండరీలు కొడితే.. అందులో అన్నీ ఆఫ్‌సైడ్‌లో ఆడినవే కావడం విశేషం. స్టోక్స్ బౌలింగ్‌లో రాహుల్.. బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో అలరించాడు. కానీ సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌లో లంచ్‌కు ముందు డబుల్ షాక్ తాకింది. కార్స్ వేసిన 25వ ఓవర్లో రాహుల్.. ఆఫ్ స్టంప్‌కు ఆవలగా వెళ్తున్న బంతిని వెంటాడి ఫస్ట్ స్లిప్స్‌లో జో రూట్ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లో స్టోక్స్ వేసిన పక్కా ప్రణాళికతో సాయి సుదర్శన్ అరంగేట్ర టెస్టు అతడికి నిరాశను మిగిల్చింది.
జైస్వాల్, గిల్ జోరు
92/2తో భోజన విరామానికి వెళ్లొచ్చిన భారత్.. ఆ తర్వాత జోరు పెంచింది. కెప్టెన్ గిల్ ఆరంభంలో వన్డే తరహా ఆట ఆడాడు. వోక్స్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు రాబట్టాడు. 96 బంతుల్లో జైస్వాల్ ఫిఫ్టీ పూర్తయింది. గిల్ అండతో జైస్వాల్ కూడా దూకుడు పెంచాడు. వోక్స్ 38వ ఓవర్లో 3 ఫోర్లు బాదిన అతడు.. టంగ్ ఓవర్లో డీప్ పాయింట్ మీదుగా సిక్సర్ బాదాడు. గిల్ కూడా టంగ్ ఓవర్లో బౌండరీతో 55 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేశాడు. టెస్టులలో అతడికి ఇదే ఫాస్టెస్ట్ (బంతులపరంగా) హాఫ్ సెంచరీ. కార్స్ 48వ ఓవర్లో తొలి బంతిని బౌండరీగా మలిచి 90లలోకి వచ్చిన జైస్వాల్.. అదే ఓవర్లో 4, 5 బంతులనూ ఫోర్లు కొట్టాడు. ఆరో బంతికి సింగిల్ తీసి తన కెరీర్లో ఐదో శతకం నమోదుచేశాడు. అయితే టీ విరామానికి వెళ్లొచ్చాక స్టోక్స్ వేసిన రెండో ఓవర్లో జైస్వాల్ బౌల్డ్ అవడంతో 129 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
రాకుమారుడి తొలి ముద్ర
జైస్వాల్ నిష్క్రమించే సమయానికి ఆటపై పూర్తి పట్టు సాధించిన గిల్.. పంత్‌తో కలిసి స్కోరుబోర్డును నడిపించాడు. ఇన్నింగ్స్‌కు ఇరుసైన నాలుగో స్థానంలో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ శతకం దిశగా సాగాడు. ఫిఫ్టీ తర్వాత కాస్త నెమ్మదించిన గిల్.. పంత్‌తో ైస్టెక్ రొటేట్ చేసి ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించాడు. బషీర్ బౌలింగ్‌లో పంత్ ఫోర్, సిక్సర్‌తో భారత్ 300 పరుగుల మార్కును అందుకుంది. 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టంగ్ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్ బౌండరీ బాదిన గిల్.. సారథిగా తొలి టెస్టులోనే బ్యాట్‌తో తన ముద్రను ఘనంగా వేశాడు. టెస్టుల్లో అతడికి ఇది ఆరో శతకం. పంత్ తన సహజశైలికి భిన్నంగా సంయమనంతో ఆడటం గమనార్హం. అజేయమైన నాలుగో వికెట్‌కు గిల్-పంత్ ద్వయం ఇప్పటికే 130 పరుగులు జోడించింది.
ఇంగ్లండ్‌తో వారిగడ్డపై టెస్టులు ఆడుతూ మొదటి రోజు ఆటలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2022లో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 338/7 చేసింది. మొత్తంగా శ్రీలంక (2017లో శ్రీలంకపై 399/3), సౌతాఫ్రికా (2001లో 372/1) తర్వాత విదేశీ గడ్డపై థర్డ్ హయ్యస్ట్ స్కోరు.
అయ్యో సాయి
జూన్ 20.. భారత క్రికెట్ దిగ్గజాలుగా వెలుగొందుతున్న సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీకి ఈ తేదీ ఎంతో ప్రత్యేకం. దాదా, ద్రావిడ్ 1996లో ఇదే రోజు ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేయగా కోహ్లీ సైతం 2011 జూన్ 20న వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టెస్టులకు ఎంట్రీ ఇచ్చాడు. దిగ్గజాలు టెస్టు అరంగేట్రం చేసిన రోజే సాయి సుదర్శన్ కూడా టెస్టులలో తొలి అవకాశం అందుకున్నా అదృష్టం మాత్రం అతడిని వెక్కిరించింది. మొదటి టెస్టులో గంగూలీ సెంచరీ చేయగా ద్రావిడ్ 95 రన్స్ చేశాడు. కోహ్లీ 19 పరుగులు చేయగా.. సాయి డకౌట్ అయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 85 ఓవర్లలో 359/3 (గిల్ 127*, జైస్వాల్ 101, స్టోక్స్ 2/43, కార్స్ 1/70)