సిడ్నీ: సిడ్నీ టెస్టు(AUSvIND) రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 141 రన్స్ చేసింది. జడేజా 8, సుందర్ ఆరు పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌కు ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. రెండో రోజు మొత్తం 15 వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 181 రన్స్‌కు ఆలౌటైంది. దీంట్లో ఇవాళ ఆ జట్టు 9 వికెట్లను కోల్పోయింది. ఉదయం భారత బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. బుమ్రా పది ఓవర్లలో రెండు వికెట్లు తీసుకుని, లంచ్ తర్వాత గాయం వల్ల ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, నితీశ్ రెడ్డి తమ బౌలింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టర్ అత్యధికంగా 57 రన్స్ చేశాడు. తొలి టెస్టు ఆడుతున్న అతను తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్టీవ్ స్మిత్ 33 పరుగుల చేసి ఔటయ్యాడు. అయితే మరో అయిదు పరుగులు జోడిస్తే, అతను పది వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలో జైస్వాల్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లోనే అతను స్టార్క్ బౌలింగ్‌లో నాలుగు బౌండరీలు కొట్టాడు. కానీ ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. టాప్ ఆర్డర్లో జైస్వాల్(22), గిల్(13), రాహుల్(13), కోహ్లీ(6) మళ్లీ విఫలమయ్యారు.
అయితే రిషబ్ పంత్.. వేగంగా హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. 29 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దాంట్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా పంత్ హాఫ్ సెంచరీ చేయడం ఇది రెండోసారి. గతంలో కేవలం 28 బంతుల్లోనే శ్రీలంకపై అర్థశతకాన్ని నమోదు చేశాడు. కానీ 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆసీస్ స్పీడ్ బౌలర్ బోలాండ్ ఇప్పటికే 13 ఓవర్లలో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జడేజా, సుందర్ క్రీజ్‌లో ఉన్నారు.
లంచ్ తర్వాత సిడ్నీ మైదానం నుంచి ఆస్పత్రికి వెళ్లిన బుమ్రా.. స్కానింగ్ తీయించుకున్నాడు. అతనికి వెన్ను నొప్పి ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వైద్య బృందం అతన్ని మానిటర్ చేస్తున్నట్లు ప్రసిద్ధి కృష్ణ తెలిపాడు. బుమ్రా ఈ సిరీస్‌లో ఇప్పటికే 32 వికెట్లు తీసుకున్నాడు.
Plenty of wickets fell on an entertaining Day Two at the SCG: https://t.co/0nmjl6QWRI#AUSvIND pic.twitter.com/LoDaZwZgPE
— cricket.com.au (@cricketcomau) January 4, 2025