పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 26 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 136 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నాలుగుసార్లు ఆగిపోయింది. దాంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. ఆస్ట్రేలియా గెలవాలంటే 26 ఓవర్లలో 131 పరుగులు చేయాలి. టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 31 పరుగులతో రాణించాడు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు మంచి శుభారంభం దక్కింది. బౌలర్లు చెలరేగడంతో టీమిండియా ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. పవర్‌ప్లేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వికెట్లను టీమిండియా కోల్పోయింది.
223 రోజుల తర్వాత మళ్లీ భారత జట్టు తరఫున వన్డేలు ఆడుతున్న రోహిత్, కోహ్లీ ప్రభావం చూపలేకపోయారు. శ్రేయాస్ అయ్యర్ కూడా 11 పరుగులకే అవుట్ అయ్యాడు. అక్షర్, రాహుల్ జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. వేగంగా పరుగులు తీసేందుకు ప్రయత్నించగా.. వర్షం పదే పదే కురవడం వారి వేగాన్ని దెబ్బతీసింది. నాలుగోసారి ఆట ప్రారంభమైన సమయంలో ఓవర్లు 26కి కుదించారు. రాహుల్ వేగంగా ఆడడంతో స్కోరు 100 పరుగులు దాటింది. అదే సమయంలో కీలక షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. చివరి ఓవర్లో నితీష్ కొన్ని మంచి షాట్లు ఆడడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరును చేరుకోగలిగింది. తన కెరియర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న నితీష్‌రెడ్డి 11 బంతుల్లో రెండు సిక్సర్లతో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, మిచెల్ స్టార్క్, ఎల్లిస్‌కు ఒక్కో వికెట్ దక్కింది.