మాంచెస్టర్: అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. లార్డ్స్ టెస్టులో పోరాడి ఓడిన టీమ్ఇండియా ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉన్నది. సిరీస్‌లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్న భారత్‌ను గాయాలు వేధిస్తున్నాయి. బుధవారం నుంచి మొదలయ్యే నాలుగో టెస్టుకు ముందు జట్టుకు ప్లేయర్ల గాయాలు ప్రతిబంధకంగా మారాయి. ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్‌సింగ్ గాయాలతో నాలుగో టెస్టుకు దూరం కాగా, యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి మోకాలి గాయంతో ఏకంగా సిరీస్‌కే దూరమయ్యాడు. మరోవైపు లార్డ్స్ టెస్టులో గాయపడ్డ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై స్పష్టత రావాల్సి ఉండగా, నితీశ్ స్థానంలో అన్శుల్ కాంబోజ్ సోమవారం జట్టుతో చేరాడు. గత కొన్ని రోజుల నుంచి వర్షంతో తడిసిముద్దవుతున్న మాంచెస్టర్‌లో కొద్దిగా గెరువు ఇవ్వడంతో ప్లేయర్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ డ్రిల్స్‌తో పాటు నెట్స్‌లో చాలా సేపు చెమటోడ్చారు. స్టార్ పేసర్ బుమ్రా నాలుగో టెస్టులో బరిలోకి దిగుతాడంటూ మీడియా భేటీలో మహమ్మద్ సిరాజ్ ప్రకటించగా, గాయాలతో పలువురు ప్లేయర్లు దూరం కావడంతో తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొన్నది. బుమ్రా ఆడేది పక్కా అని పేర్కొన్న సిరాజ్ బెస్ట్ కాంబినేషన్‌తో ఇంగ్లండ్‌ను ఎదుర్కొంటామని తెలిపాడు.
రిషభ్ పంత్ ఫిట్!
లార్డ్స్ టెస్టులో గాయపడ్డ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫిట్‌గా కనిపించాడు. సోమవారం ఫీల్డింగ్ ప్రాక్టీస్ సెషన్లో పంత్ చురుకుగా పాల్గొన్నాడు. స్లిప్స్ ప్రాక్టీస్‌లో భాగంగా పంత్‌తో పాటు కెప్టెన్ గిల్, రాహుల్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. మూడో టెస్టులో బుమ్రా బంతిని అందుకునే క్రమంలో ఎడమచేతి చూపుడు వేలుకు తీవ్ర గాయమైంది. అదే నొప్పిని భరిస్తూ పంత్ బ్యాటింగ్‌కు రాగా, అతని స్థానంలో జురెల్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించాడు. అయితే సిరీస్‌లో కీలకమైన నాలుగో టెస్టులో పంత్ అనుభవం కీలకం కానుంది. గాయం నుంచి ఒకింత తేరుకున్న ఈ డాషింగ్ క్రికెటర్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. పేసర్లతో పాటు స్పిన్నర్లను తనదైన శైలిలో ఎదుర్కొన్నాడు. దీనికి కొనసాగింపుగా వికెట్‌కీపింగ్ సెషన్లోనూ పంత్ గాయం ఆనవాళ్లు పెద్దగా కనిపించలేదు. మొత్తంగా 89 ఏండ్లుగా ఊరిస్తున్న మాంచెస్టర్‌లో విజయం కోసం భారత్ పట్టుదలతో కనిపిస్తున్నది. ఓవైపు గాయాలు వేధిస్తున్నా..ఇంగ్లండ్‌కు గట్టిపోటీనివాలన్న పట్టుదలతో ఉన్నది. తుది జట్టు కూర్పుపై మంగళవారం టీమ్ మేనేజ్మెంట్ ఒక అంచనాకు వచ్చే అవకాశముంది.
నితీశ్ ఔట్, అన్శుల్ ఇన్
జిమ్ సెషన్లో మోకాలి గాయానికి గురైన ఆల్‌రౌండర్ నితీశ్.. సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కాగా, ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో ముగిసిన అనధికారిక టెస్టు మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్న అన్శుల్ తాజాగా జట్టుతో చేరాడు. సోమవారం ప్రాక్టీస్ సెషన్లో జట్టు సభ్యులతో చేరిన ఈ 24 ఏండ్ల హర్యానా యువ పేసర్.. చీఫ్ కోచ్ గౌతం గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సమక్షంలో 45 నిమిషాల పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. సహచర బౌలర్లు బుమ్రా, సిరాజ్ సలహాలు, సూచనలతో అన్శుల్ తన బౌలింగ్‌కు మరింత పదునుపెట్టుకున్నాడు. అన్శుల్ బౌలింగ్ శైలిని గౌతీతో పాటు, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ దగ్గర నుంచి పరిశీలించారు. సిరీస్‌కు ముందు సన్నాహక మ్యాచ్‌ల్లో ఆడిన అన్శుల్ ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. స్వింగ్ బౌలింగ్‌కు తోడు లోయార్డర్‌లో పరుగులు సాధించడంలో అన్శుల్ కీలకం కానున్నాడు. గాయపడ్డ నితీశ్ స్థానంలో మాంచెస్టర్ టెస్టులో అన్శుల్ అరంగేట్రం దాదాపు ఖాయం కాగా, ఆకాశ్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత నెలకొన్నది. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న ఆకాశ్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మోర్కెల్, ఫిజియో..నెట్స్‌లో అతడి బౌలింగ్ శైలిని పరిశీలించారు. పూర్తి ఫిట్నెస్ అందుకోలేకపోతే ఆకాశ్‌దీప్ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయనున్నారు.