కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ దానిశ్ కనేరియా మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కనేరియా తాజాగా తన పౌరసత్వంపై ఆసక్తికరంగా స్పందించాడు. పహల్గాం ఉగ్రదాడితో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కనేరియా ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని వెలువరించాడు. ‘పాకిస్థాన్ జట్టులో ప్లేయర్లు, మేనేజ్మెంట్ నుంచి చాలాసార్లు వివక్ష ఎదుర్కొన్నాను. భారత్ అంతర్గత వ్యవహారాల గురంచి కాకుండా పదే పదే పాకిస్థాన్ గురించి మాట్లాడటంపై చాలా మంది నన్ను ప్రశ్నిస్తూ ఉండే వారు.
భారత పౌరసత్వం కోసం ఇదంతా చేస్తున్నావంటూ నన్ను నిలదీసేవారు. కానీ ఏనాడు అలా ఆలోచించలేదు. పాకిస్థాన్ నాకు జన్మభూమి అయితే భారత్ నా మాతృభూమి. మా పూర్వీకులు అందరూ భారతీయులే. నా వరకు భారత్ అనేది ఒక గుడిలాంటిది. ప్రస్తుతానికి భారత పౌరసత్వం కోసం ఎలాంటి ప్రణాళికలు లేవు. ఒకవేళ భవిష్యత్‌లో ఆ ఆలోచన ఉంటే నాలాంటి వారి కోసం సీఏఏ ఆప్షన్ ఉంది’ అని అన్నాడు. 2000 నుంచి 2010 వరకు పాక్ జట్టుకు ఆడిన కనేరియా లెగ్‌స్పిన్నర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.