అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌కు చేదు అనుభవం. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజయం తర్వాత తొలిసారి వన్డే సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా అభిమానుల అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓడి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకబడిపోయింది.తొలుత రోహిత్‌శర్మ(97 బంతుల్లో 73, 7ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయాస్ అయ్యర్(77 బంతుల్లో 61, 7ఫోర్లు) అర్ధసెంచరీలతో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 264/9 స్కోరు చేసింది.
కెప్టెన్ గిల్(9) నిరాశపర్చగా, విరాట్‌కోహ్లీ(0) వరుసగా రెండోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. అడిలైడ్‌లో ఘనమైన రికార్డు ఉన్న కోహ్లీ కనీసం పరుగుల ఖాతా తెరువకుండానే భారంగా పెవిలియన్ చేరాడు. ఆడమ్ జంపా(4/60) నాలుగు వికెట్లతో భారత్ పతనంలో కీలకమయ్యాడు. లక్ష్యఛేదనలో ఆసీస్ 46.2 ఓవర్లలో 265/8 స్కోరు చేసింది. మాథ్యూ షార్ట్(78 బంతుల్లో 74, 4ఫోర్లు, 2సిక్స్‌లు), కాపర్ కనోలీ(53 బంతుల్లో 61 నాటౌట్, 5ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో ఆసీస్‌ను గెలిపించారు. సుందర్(2/37), అర్ష్‌దీప్‌సింగ్(2/41), హర్షిత్ రానా(2/59) రెండేసి వికెట్లు తీశారు. జంపాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఆసీస్‌కు టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ సరైన శుభారంభం దక్కలేదు. 17 పరుగులకే జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో గిల్‌తో పాటు కోహ్లీ ఔటయ్యారు. బార్ట్లెట్ స్వింగ్ డెలీవరిని సరిగ్గా అంచనా వేయని కోహ్లీ గోల్డెన్ డక్‌గా నిష్క్రమించాడు. ఈ దశలో ఏడో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్..రోహిత్ శర్మ కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు ఆసీస్ బౌలింగ్ దాడికి ఎదురొడ్డి నిలిచారు. ఈ క్రమంలో హాజిల్‌వుడ్ వేసిన 17 బంతుల్లో ఈ ఇద్దరు కనీసం ఒక్క పరుగు చేయలేకపోయారు. అయితే మిచెల్ ఒవెన్ బౌలింగ్‌లో రోహిత్ రెండు కండ్లు చెదిరే సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు.
మరో ఎండ్‌లో శ్రేయాస్..రోహిత్‌కు చక్కని సహకారం అందించాడు. ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో..రోహిత్‌ను స్టార్క్ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత అక్షర్‌పటేల్(44)తో అయ్యర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పిచ్‌ను తనకు అనుకూలంగా మలుచుకుంటూ స్పిన్నర్ జంపా..వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇండియాను దెబ్బతీశాడు. అయ్యర్‌తో పాటు అక్షర్, రాహుల్(11), నితీశ్‌కుమార్(8)ను ఔట్ చేశాడు. ఆఖర్లో హర్షిత్ రానా(24 నాటౌట్) బ్యాటు ఝులిపించడంతో భారత్‌కు పోరాడే స్కోరు దక్కింది.
లక్ష్యఛేదనలో ఆసీస్ తొలుత తడబడ్డా.. ఆ తర్వాత తేరుకుంది. ఓపెనర్లు మార్ష్(11), హెడ్(28) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా..మిడిలార్డర్లో షార్ట్, కనోలీ, రెన్షా(30), మిచెల్ ఒవెన్(36) తలా కొన్ని పరుగులు చేశారు. షార్ట్, కనోలీ అర్ధసెంచరీలతో జట్టు విజయంలో కీలకమయ్యారు. ఆసీస్ బ్యాటర్లు ఇచ్చిన మూడు క్యాచ్‌లు విడిచిపెట్టడం మన గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.
భారత్: 50 ఓవర్లలో 264/9(రోహిత్ 73, అయ్యర్ 61, జంపా 4/60, బార్ట్లెట్ 3/39), ఆస్ట్రేలియా: 46.2 ఓవర్లలో 265/8(షార్ట్ 74, కనోలీ 61 నాటౌట్, సుందర్ 2/37, అర్ష్‌దీప్‌సింగ్ 2/41)