ఛేదించాల్సిన లక్ష్యం 340. ఆరంభంలో ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు వెళ్లారు. దారి చూపాల్సిన సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్‌ది అదే వైఫల్య గాథ. కానీ జైస్వాల్, పంత్ పోరాటంతో గెలుపు మీద ఆశలు లేకున్నా ఓటమి గండాన్నైనా తప్పించుకోవచ్చునన్న ధీమా. మూడో సెషన్ ఆట మొదలైన కొద్దిసేపటికే పంత్ మరోసారి అనవసరపు షాట్‌కు పోయి వికెట్ పారేసుకోవడంతో ఆస్ట్రేలియా పుంజుకుంది. అక్కడ్నుంచి ఆతిథ్య జట్టు బౌలర్లు పట్టు సడలించలేదు. మూడో సెషన్లో 34 పరుగుల వ్యవధిలోనే ఆఖరి 7 వికెట్లను కోల్పోయిన రోహిత్ సేన మరో ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఓటమితో సిరీస్ నిలబెట్టుకునే అవకాశంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునే అవకాశాలనూ టీమ్ఇండియా మరింత సంక్లిష్టం చేసుకుంది.
మెల్బోర్న్: ఏం మారలేదు! అదే కథ.. అదే వ్యథ! బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో వైఫల్యాల పరంపరను భారత క్రికెట్ జట్టు దిగ్విజయంగా కొనసాగిస్తూ మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. మెల్బోర్న్ టెస్టులో రోహిత్ సేన 184 పరుగుల తేడాతో ఓడి సిరీస్‌ను నిలబెట్టుకునే అవకాశంతో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తునూ సంక్లిష్టం చేసుకుంది. ఆట చివరి రోజు ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల ఛేదనలో టీమ్ఇండియా.. 79.1 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలి దారుణ ఓటమి పాలైంది. ఛేదనలో యశస్వీ జైస్వాల్ (208 బంతుల్లో 84, 8 ఫోర్లు), రిషభ్ పంత్ (104 బంతుల్లో 30, 2 ఫోర్లు) తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేక చతికిలపడ్డారు. ఆసీస్ బౌలర్లలో సారథి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ పాట్ కమిన్స్ (3/28), స్కాట్ బొలాండ్ (3/39), నాథన్ లియాన్ (2/37) పర్యాటక జట్టును కట్టడి చేశారు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా సిరీస్‌లో చివరి టెస్టు మొదలుకానుంది.
చేయాల్సిన పరుగులు 340. ఉన్న ఓవర్లు 92. చేతిలో 10 వికెట్లు. ఛేదన తేలికైతే కాదు గానీ అసాధ్యమైతే కాదు. ఆరంభంలో వికెట్ కాపాడుకుని తర్వాత బ్యాట్ ఝుళిపిస్తే గెలిచే అవకాశాలు మెరుగయ్యేవి. అందుకు తగ్గట్టుగానే భారత ఇన్నింగ్స్ కూడా నెమ్మదిగానే మొదలైంది. మొదటి 16 ఓవర్లకు భారత్ చేసిన స్కోరు 25/0. తన స్వభావానికి విరుద్ధంగా షాట్ల జోలికి పోకుండా 39 బంతుల్లో 9 పరుగులే చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కమిన్స్ వేసిన ఫుల్ డెలివరీని ఆడబోయి గల్లీలో మార్ష్‌కు క్యాచ్ ఇవ్వడంతో వికెట్ల పతనం మొదలైంది. అదే ఓవర్లో కమిన్స్.. కేఎల్ రాహుల్‌నూ డకౌట్‌గా వెనక్కి పంపి భారత్‌కు డబుల్ షాకిచ్చాడు. యావత్ భారత క్రికెట్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ (5) మరోసారి చేతులెత్తేశాడు. దీంతో లంచ్‌కు ముందే భారత్ 33/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
8 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ ఆత్మరక్షణలో పడింది. యశస్వీకి జతకలిసిన పంత్.. అనవసరపు షాట్ల జోలికి పోకుండా డిఫెన్స్‌నే ఆశ్రయించారు. రెండో సెషన్ ఆసాంతం ఈ ద్వయం కంగారూ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంది. ఈ క్రమంలో యశస్వీ.. లియాన్ వేసిన ఓవర్లో బౌండరీతో 127 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. టెస్టులలో అతడికిది రెండో నెమ్మదైన హాఫ్ సెంచరీ. పంత్‌ను ఔట్ చేసేందుకు ఆసీస్ బౌలర్లు ఊరించే బంతులేసినా అతడు ఏకాగ్రత కోల్పోలేదు. రెండో సెషన్లో ఈ జోడీ 27.5 ఓవర్లు ఆడి 79 పరుగులు చేసింది.
యశస్వీ, పంత్ పట్టుదలతో డ్రా దిశగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ మూడో సెషన్ తర్వాత కుదుపునకు లోనైంది. థర్డ్ సెషన్లో హెడ్ వేసిన 59వ ఓవర్లో నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయిన పంత్.. లాంగాన్ వద్ద మార్ష్ డైవింగ్ క్యాచ్‌తో క్రీజును వీడాడు. భారత ఓటమికి బీజం పడిందిక్కడే. ఆ తర్వాత 20 ఓవర్లలోపే టీమ్ఇండియా ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో నితీశ్ రెడ్డి (1), సీనియర్ బ్యాటర్ రవీంద్ర జడేజా (2) అలా వచ్చి ఇలా వెళ్లారు. వాషింగ్టన్ సుందర్ (45 బంతుల్లో 5 నాటౌట్)తో కలిసి ఏడు ఓవర్ల పాటు వికెట్ కాపాడుకున్న యశస్వీ.. కమిన్స్ వేసిన 71వ ఓవర్లో థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో వెనుదిరిగాల్సి వచ్చింది. లోయరార్డర్ బ్యాటర్లూ పోరాడకపోవడంతో భారత్.. 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 121/3తో పటిష్ఠంగా ఉన్న రోహిత్ సేన.. 34 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 474 ఆలౌట్;
భారత్ తొలి ఇన్నింగ్స్: 369 ఆలౌట్;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 234 ఆలౌట్;
భారత్ రెండో ఇన్నింగ్స్: 79.1 ఓవర్లలో 155 ఆలౌట్ (జైస్వాల్ 84, పంత్ 30, కమిన్స్ 3/28, బొలాండ్ 3/39)