హాంకాంగ్: ప్రతిష్టాత్మక 2027 ఏఎఫ్సీ ఏషియన్కప్ టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు భంగపాటు ఎదురైంది. మంగళవారం హాంకాంగ్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత్ 0-1 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా దక్కిన పెనాల్టీని హాంకాంగ్ చక్కగా సద్వినియోగం చేసుకుంది.
మ్యాచ్ అదనపు సమయం(90+1)లో భారత గోల్‌కీపర్ విశాల్ కైత్ చేసిన తప్పిదంతో వచ్చిన పెనాల్టీని పెరీరా గోల్ చేయడంతో హాంకాంగ్ విజయం ఖరారైంది. చివరి వరకు రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగగా, చివరి నిమిషంలో చేసిన తప్పుతో టీమ్ఇండియా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమితో గ్రూపు-సీలో భారత్ ఒక పాయింట్‌తో రెండో స్థానంలో ఉండగా, హాంకాంగ్(4) అగ్రస్థానంలో ఉంది.