బ్రిస్బేన్: గబ్బా టెస్టులో టీమ్ఇండియా ఎదురీదుతున్నది. బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యంతో తొలిఇన్నింగ్స్‌లో వెనుకపడిపోయింది. 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 167 రన్స్ చేసింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే కెప్టెన్ రోహిత్‌ను కమిన్స్‌ను ఔట్ చేశాడు. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను (KL Rahul) నాథన్ బోల్తా కొట్టించాడు. 42.3 ఓవర్లో స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌కు చిక్కాడు. దీంతో 139 బాల్స్‌లో 84 రన్స్ చేసిన రాహుల్ నిరాశగా వెనుతిరిగాడు. మరోవైపు నితీశ్ రెడ్డితో కలిసి రవీంద్ర జడేజా (41) తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నాడు.
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును ఆదుకోవాల్సిన కెప్టెన్ రోహిత్ (10).. మరోసారి విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ 23.3వ ఓవర్లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా.. రాహుల్‌తో కలిసి ఆచుతూచి ఆడుతూ స్కోర్‌బోర్డుకు ఒక్కో పరుగు జోడించాడు. ఈక్రమంలో క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని నాథన్ విడదీశాడు. దీంతో మ్యాచ్‌లో తొలి వికెట్‌ను దక్కించుకున్నాడు. అయితే నాలుగో రోజు తొలి బంతికే రాహుల్‌కు లైఫ్ లభించింది. స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్.. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. చివరికి మళ్లీ స్మిత్‌కే క్యాచ్ ఇచ్చి ఔటవడం గమనార్హం.