తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదురైనా.. విశాఖ తీరంలో చక్కటి విజయాన్నందుకున్న టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగిస్తూ సిరీస్ సమం చేసేందుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాజ్‌కోట్‌లో జరుగనున్న నాలుగో పోరులో సత్తాచాటేందుకు పంత్ సేన సమాయత్తమైంది. చల్లని వాతావరణంలో భారీ స్కోరుకు సహకరించనున్న పిచ్‌పై ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి!
రాజ్‌కోట్: సొంతగడ్డపై సీనియర్ల గైర్హాజరీలో పోటీలో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ కోసం టీమ్ఇండియా రెడీ అయింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా నాలుగో టీ20 జరుగనుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి సఫారీలు ముందంజ వేస్తే.. వైజాగ్ వేదికగా జరిగిన మూడో పోరుతో పంత్ సేన పోటీలోకి వచ్చింది. ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉన్న మన జట్టు సిరీస్ సమం చేయాలని తహతహలాడుతుంటే.. దక్షిణాఫ్రికా ట్రోఫీ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. ఓపెనర్లు ఫర్వాలేదనిపిస్తున్నా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోవడం టీమ్ఇండియాను ఇబ్బంది పెడుతున్నది. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించగా.. యంగ్గన్స్తో కూడిన జట్టుకు పంత్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే గతంలో మాదిరి ధనాధన్ షాట్లు ఆడలేకపోతున్న పంత్.. ఒత్తిడిని పక్కనపెట్టి బ్యాట్‌కు పనిచెప్తే భారత్‌కు తిరుగుండదు. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించనుండగా.. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలో దింపాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తున్నది. మరోవైపు రెండో మ్యాచ్‌కు ముందు గాయపడిన దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్.. గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే.. హెన్రిక్స్ స్థానంలో ఓపెనింగ్ చేయడం ఖాయమే.
మిడిల్లోనే సమస్య..
ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్ కిషన్ మంచి షాట్లతో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా గత మ్యాచ్‌లో అర్ధ శతకంతో రాణించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న శ్రేయస్ అయ్యర్ అతి జాగ్రత్తకు పోతున్నట్లు కనిపిస్తున్నది. స్పిన్నర్లపై ప్రతాపం చూపుతున్న అతడు.. తాజా సిరీస్‌లో పేసర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని గణాంకాలు చెబుతున్నాయి. ఇక కొత్తగా జట్టు పగ్గాలు అందుకున్న పంత్.. ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. పూర్తి ఆత్మరక్షణ ధోరణి అవలంభిస్తూ.. అప్పనంగా వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఐపీఎల్ 15వ సీజన్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పంత్.. రాణించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో తప్పక చోటు దక్కించుకోవాలనుకుంటున్న వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ నిలకడ కనబరుస్తుండగా.. గత మ్యాచ్‌లో హర్షల్ పటేల్ కూడా గాడిన పడ్డాడు. విశాఖ పోరులో స్పిన్నర్లు సత్తాచాటారు. మిడిల్ ఓవర్స్‌లో చాహల్, అక్షర్ మరోసారి మ్యాజిక్ కొనసాగిస్తే.. సిరీస్ సమం చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు! మరోవైపు ఇక్కడే సిరీస్ చేజిక్కించుకోవాలని దక్షిణాఫ్రికా కృతనిశ్చయంతో ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, అవేశ్, భువనేశ్వర్, చాహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్/హెన్రిక్స్, డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, కేశవ్ మహరాజ్, నోర్జే, షంసీ.