ప్రతిష్ఠాత్మక క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రేసులోకి వచ్చింది. సుదీర్ఘ చరిత్ర కల్గిన విశ్వక్రీడల ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ)కు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ)లేఖ ద్వారా పేర్కొంది. అక్టోబర్ 1వ తేదీనే ఐవోసీకి పంపినట్లు ఐవోఏ వర్గాలు పేర్కొన్నాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ సహా సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ పోటీపడుతున్నాయి. ఆయా దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అంచనా వేస్తూ నిర్వహణ హక్కులపై ఐవోసీ నిర్ణయం తీసుకోనుంది. 140 కోట్ల మందికి పైగా జనాభా కల్గిన భారత్‌కు ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కితే మన సుదీర్ఘ కల సాకారమైనట్లే.
న్యూఢిల్లీ: ఒలింపిక్స్..ప్రపంచ దేశాలన్నీ ఒక్క చోట చేరి జరుపుకునే అతిపెద్ద క్రీడాపండుగ. సుదీర్ఘ కాలంగా క్రీడాభిమానులను అలరిస్తూ వస్తున్న ఒలింపిక్స్‌కు ఇప్పటి వరకు భారత్ ఆతిథ్యమివ్వలేకపోయింది. విశ్వక్రీడల్లో మన పతక ప్రదర్శన అంతంత మాత్రమైనప్పటికీ ఆతిథ్యంలోనూ మనకు ఇన్నేండ్లు నిరాశే ఎదురైంది. మన దేశంలో విశ్వక్రీడలను ప్రత్యక్షంగా వీక్షించాలన్న భారతీయుల కల సాకారమయ్యేందుకు కీలక అడుగు ముందుకు పడింది. విశ్వక్రీడల ఆతిథ్యానికి తాము సిద్ధంగా ఉన్నట్లు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను ఐవోసీకి పంపించింది. ఇన్ని రోజులు ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఐవోసీతో చర్చలు జరుపుతూ వచ్చిన ఐవోఏ తాజాగా ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు లేఖ పంపింది. అయితే అక్టోబర్ 1వ తేదీనే ఇది పంపినట్లు ఐవోఏ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉషా.. వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఒలింపిక్స్ నిర్వహణ ద్వారా దేశంలో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. విశ్వక్రీడల ఆతిథ్యం గురించి గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఐవోసీ సమావేశంలో తొలిసారి ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తి కనబరిచారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన విజేతలను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్‌లో దేశంలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి మరింత బలం చేకూరుస్తూ ఐవోఏ తమ అంగీకారాన్ని లేఖ ద్వారా తెలిపింది. అయితే ఐవోసీకి ఎన్నికలు జరిగే వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దీనికి తోడు ఆతిథ్య హక్కుల కోసం భారత్ సహా సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ వంటి దేశాలు పోటీలో ఉన్నాయి. దీంతో వీటి నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
బిడ్డింగ్ సుదీర్ఘ ప్రక్రియ: ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల బిడ్డింగ్ అనేది సుదీర్ఘ ప్రక్రియ. ఇందులో భాగంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ కింద భారత్ తొలి అడుగు వేసింది. ఇప్పటి దాకా అనధికారికంగా ఐవోసీతో చర్చలు జరిపిన ఐవోఏ తాజాగా ఆతిథ్య హోదాలో పోటీ పడనుంది. అయితే దీని వెనుక దాదాపు రెండేండ్ల పాటు ప్రక్రియ కొనసాగనుంది. ఆతిథ్యం కోసం పోటీపడే దేశంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను తొలుత అంచనా వేస్తారు. మానవ హక్కులపై కూడా అధ్యాయనం చేస్తారు. తదనంతరం ఈ ప్రక్రియ ‘టార్గెటెడ్ డైలాగ్’కు చేరుకుంటుంది. ఆ తర్వాత ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నిస్తున్న దేశాలు నిర్దిష్టమైన రీతిలో బిడ్డింగ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ హోస్ట్ కమిటీ అంచనా వేస్తుంది. ఆఖరికి ఐవోసీ సభ్యుల రహస్య ఓటింగ్ ప్రక్రియతో ఆతిథ్య దేశాన్ని ఎన్నుకుంటారు.
ఒకవేళ భారత్‌కు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కితే అహ్మదాబాద్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే అహ్మదాబాద్ ముందువరుసలో ఉంది. భారత్ చివరిసారి 2010లో కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యమివ్వగా…ప్రస్తుత ఐవోసీ చీఫ్ థామస్ బాచ్ భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఐవోసీ ప్రతినిధులు, కీలకమైన ప్రతినిధులతో ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉషా చర్చలు జరుపడం దీనికి మరింత బలం చేకూరుస్తున్నది. ఒకవేళ భారత్‌కు బిడ్డింగ్ లభిస్తే..సంప్రదాయక క్రీడలైన యోగా, ఖోఖో, కబడ్డీ లాంటి వాటిని ఒలింపిక్స్ చేర్చేందుకు ఆతిథ్య హోదాలో ఒత్తిడి చేసే అవకాశముంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను క్రీడా మంత్రి మన్సూఖ్ మాండవీయాకు ఐవోఏ అందించినట్లు తెలిసింది. మరోవైపు ఐవోఏలో ప్రస్తుతం పాలకవర్గ సభ్యుల మధ్య తీవ్రమైన విబేధాలు కొనసాగుతున్నాయి. చీఫ్ పీటీ ఉషా, ఎగ్జిక్యూటివ్ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తున్నది. సీఈవోగా రఘురామ్ అయ్యర్ నియామకాన్ని కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ ముగింపు పలుకుతూ బిడ్డింగ్ ప్రక్రియలో ఐవోఏ ఏ మేరకు విజయవంతం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.