న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్టార్ లిఫ్టర్ మీరాబాయి చానుకు 55కిలోల విభాగంలో అర్హత దక్కకపోడం భారత్‌కు ఇబ్బందేమి లేదని జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చీఫ్ కోచ్ విజయ్‌శర్మ పేర్కొన్నాడు. కామన్వెల్త్లో మీరాబాయిచాను(55కి), జిల్లీ దాలబెహరా(49కి), బింద్యారాణిదేవి(59కి) బరిలోకి దింపాలని జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య(ఐడబ్ల్యూఎల్ఎఫ్) యోచించింది. దీంతో పతకాల సంఖ్యను పెంచుకోవచ్చని చూసింది. అయితే కొత్త నిబంధన ప్రకారం భారత ఎంట్రీలు తిరస్కరణకు గురయ్యాయి. ఒక విభాగంలో టాప్‌ర్యాంక్‌లో ఉన్న లిఫ్టర్ నేరుగా అర్హత సాధించే అవకాశముంటుంది. ఒకవేళ అతడు/ఆమె తప్పుకుంటే గతంలో లాగా ఆ తర్వాత ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్‌కు ప్రస్తుతం అవకాశమనేది లేకుండా పోయింది. దీనిపై మీరాబాయిచాను కోచ్ విజయ్‌శర్మ స్పందిస్తూ ‘రెండు విభాగాల్లో మీరాను పోటీకి దింపాలనుకున్నాం. కానీ నిబంధనలు మారాయి. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ కొత్త నిబంధన ప్రకారం టాప్ ర్యాంక్ లిఫ్టర్ మాత్రమే అవకాశముంటుంది. అయినా మనకు వచ్చిన సమస్య ఏమి లేదు. చాను(49కి), బింద్య(55కి), పాపీ హజారికా(64కి) ఆయా కేటగిరీల్లో పోటీకి దిగుతారు’ అని అన్నాడు.