కొలంబో : శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ముందంజ వేయడానికి భారత్ రంగం సిద్ధం చేసుకుంది. ఫాలోఆన్‌లో పడినా మంచి పోరాటపటిమ ప్రదర్శించిన శ్రీలంక ఆఖరి రోజుకు తీసుకెళ్లిన రెండో టెస్టులో గెలుపు ముంగిట నిలిచింది. అద్భుతం చేస్తేనో.. వరుణుడు ఆదుకుంటేనో తప్ప లంకకు ఓటమి ఖాయమే. ఓవర్‌నైట్ స్కోరు 265/8 నాలుగో రోజు, బుధవారం ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు మరో 25 పరుగులే చేసి తొలి ఇన్నింగ్స్‌లో 290 వద్ద ఆలౌటైంది. సోనల్ దినుషా (103) శతకం సాధించినా జట్టుకు ఫాలోఆన్ తప్పించలేకపోయాడు.
ఫలితంగా 213 పరుగుల లోటు స్కోరుతో ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక వర్షం కారణంగా ముందుగానే ముగిసిన నాలుగో రోజు ఆట చివరకు 229/6తో ఓటమికి ఎదురీదుతోంది. పసిందు సూర్యబండార (173 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 92), కమిందు మెండిస్ (55) అర్ధ శతకాలతో ఆతిథ్య జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి దెబ్బకొట్టారు. మానవ్ సుతార్ (2/81) రెండు వికెట్లతో రాణించాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినుషా (7 బ్యాటింగ్), కేశర నువంతా (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో మరో 4 వికెట్లు ఉండగా.. లంక 16 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కొలంబోలో గురువారం కూడా వర్ష సూచన ఉంది. అయితే, ఒక సెషన్ ఆట సాధ్యమైనా భారత్ గెలుపు లాంఛనం పూర్తి చేసే అవకాశం ఉంది.
మూడో రోజు చివర్లో భారత బౌలర్లను విసిరిగించిన లంక టెయిలెండర్లు నాలుగో రోజు త్వరగానే తలవంచారు. యువ ఆల్‌రౌండర్ దినుషా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతకంతో సత్తా చాటాడు. ఆరంభంలోనే స్పిన్నర్ సారాంశ్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో 90ల్లోకి వచ్చిన అతను.. ప్రసిద్ధ్ ఓవర్లో మరో బౌండరీతో 147 బంతుల్లో వంద మార్కు దాటాడు. అతనితో కలిసి తొమ్మిదో వికెట్‌కు 58 పరుగులు జోడించిన లాహిరు కుమార (12)ను ఔట్ చేసిన సారాంశ్ టెస్టుల్లో వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్ పట్టిన క్యాచ్‌తో దినుషాను కూడా పెవిలియన్ చేర్చి లంక తొలి ఇన్నింగ్స్‌ను ముగించాడు. భారత కెప్టెన్ గిల్ లంకను ఫాలోఆన్ ఆడించేందుకే మొగ్గు చూపాడు.
భారీ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఆతిథ్య జట్టుకు నాలుగో ఓవర్లోనే పేస్ లీడర్ సిరాజ్ షాకిచ్చాడు. అతని బౌలింగ్‌లో అనవసర పుల్ షాట్ ఆడిన ఓపెనర్ ఉదార (3).. సారాంశ్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పసిందుకు అదృష్టం కలిసొచ్చింది. 17, 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. సుతార్ వేసిన 11వ ఓవర్లో అతను ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్ డ్రాప్ చేశాడు. బంతిని అందుకునే సమయంలో కింద పడిన అతను నొప్పితో గ్రౌండ్ వీడాడు. కాసేపటికే జడేజా బౌలింగ్‌లో ఇచ్చిన టఫ్ క్యాచ్‌ను ప్రసిద్ధ్ డ్రాప్ చేశాడు.

వీటిని సద్వినియోగం చేసుకున్న అతను ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లగా.. భారీ షాట్లతో ఎదురుదాడికి దిగిన మరో ఓపెనర్ కమిల్ మిషార (32)ను మంచి టర్నింగ్ బాల్‌తో జడేజా ఎల్బీ చేశాడు. కమిందు మెండిస్ తోడుగా 83/2 స్కోరుతో తొలి సెషన్‌ను ముగించిన పసిందు లంచ్ బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో కమిందు భారీ షాట్లతో అలరించాడు. సుతార్‌ను టార్గెట్ చేసి రెండు సిక్సర్లు కొట్టాడు. పేసర్ ప్రసిధ్ ఓవర్లో సిక్స్‌తో అర్ధ శతకం పూర్తి చేశాడు. అతని స్ఫూర్తితో పసిందు కూడా వరుస బౌండరీలతో జోరు పెంచడంతో మరో వికెట్ పడకుండా లంక రెండో సెషన్ ముగించేలా కనిపించింది. కానీ, డ్రింక్స్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ, కెప్టెన్ గిల్ కలిసి భారత్‌కు కీలక బ్రేక్ ఇచ్చాడు.
ఓవర్ ది వికెట్ ప్రసిధ్ వేసిన ఊరించే షార్ట్ బాల్‌కు కమిందు ఇచ్చిన క్యాచ్‌ను గిల్ వెనక్కుపరుగెడుతూ అద్భుతంగా అందుకోవడంతో మూడో వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. వేగం తగ్గించిన పసిందు.. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (23) క్రీజులో కుదురుకోవడంతో ఓ దశలో 209/3తో ఆతిథ్య జట్టు పోటీలోకి వచ్చేలా కనిపించింది. కానీ, మూడో సెషన్లో భారత బౌలర్లు మళ్లీ పుంజుకున్నారు. సుతార్ బౌలింగ్‌లో ఇన్సైడ్ ఎడ్జ్‌తో స్లిప్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ ధనంజయ వెనుదిరిగాడు. కెరీర్లోతొలి శతకం దిశగా దూసుకెళ్తున్న పసిందును సుతార్ తెలివైన వైడ్ బాల్‌తో స్టంపౌట్ చేశాడు. కాసేపటికే డిక్వెలా (6)ను సారాంశ్ ఎల్బీ చేయడంతో 218/6తో డీలా పడ్డ లంక నాలుగో రోజే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, భారత బౌలర్లు జోరు మీద ఉన్న దశలో భారీ వర్షం రావడంతో గంట ముందే ఆట ముగిసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 89.4 ఓవర్లలో 265/8 (దినుషా 103, పసిందు 80, ప్రసిద్ధ్ 3/52, సుతార్ 3/85);
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 72.4 ఓవర్లలో 229/6 (పసిందు 92, కమిందు 55, సుతార్ 2/81).