అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో అద్వితీయ పోరాటం కనబర్చి నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు.. మరో మెగాటోర్నీకి సిద్ధమైంది. హాకీ ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం తొలి పోరులో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో మన అమ్మాయిలు ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
ఈ టోర్నీ ఆరంభ సీజన్ (1974)లో నాలుగో స్థానంలో నిలువడమే ఇప్పటి వరకూ భారత అత్యుత్తమ ప్రదర్శన కాగా.. ఈ సారి ఎలాగైనా చాంపియన్‌గా నిలువాలని టీమ్ఇండియా కృతనిశ్చయంతో ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి 16 స్థానాల్లో ఉన్న జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఇంగ్లండ్, చైనా, న్యూజిలాండ్‌తో కలిసి భారత్ పూల్-‘బి’లో ఉంది. ఇటీవల ముగిసిన ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి అగ్రశ్రేణి జట్లను వెనక్కినెట్టి మూడో స్థానంలో నిలువడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే జోరులో ఈసారి కప్పు కొట్టాలనుకుంటున్న భారత జట్టుకు సీనియర్ గోల్‌కీపర్ సవిత సారథిగా వ్యవహరిస్తున్నది. సలీమ, వందన కటారియా, లాల్రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్, షర్మిలా దేవి, దీప్ గ్రేస్ ఎక్కా సమిష్టిగా సత్తాచాటితే మన అమ్మాయిలకు తిరుగుండదు.