ఢిల్లీ : స్వదేశంలో వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టునూ మూడు రోజుల్లో ముగిద్దామనుకున్న భారత జట్టుకు ఒకింత నిరాశ. కరీబియన్ జట్టు ఫాలోఆన్ ఆడుతూ పోరాటపటిమను ప్రదర్శించడంతో టీమ్ఇండియా విజయం వాయిదాపడింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (145 బంతుల్లో 87 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (103 బంతుల్లో 66 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 248 రన్స్‌కే ఆలౌట్ అవడంతో ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ (5/82) తన కెరీర్లో ఐదోసారి ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకబడే ఉంది. మ్యాచ్‌లో భారత విజయం ఖాయమైనప్పటికీ నాలుగో రోజు ఉదయం సెషన్లో భారత బౌలర్లను ఎదుర్కుని వెస్టిండీస్ ఏ మేరకు నిలబడుతుంది? అనేది ఆసక్తికరం.
140/4తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ ఇన్నింగ్స్ లంచ్ తర్వాత కొద్దిసేపటికే ముగిసింది. ఆ జట్టుపై ఘనమైన రికార్డు కల్గిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్.. వరుస ఓవర్లలో పర్యాటక జట్టుకు షాకులిచ్చాడు. మూడో రోజు తాను వేసిన నాల్గో ఓవర్లోనే హోప్ (36)ను ఔట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికిన అతడు.. తన మరుసటి ఓవర్లో టెవిన్ (21)నూ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఊపులో గ్రీవ్స్ (17)నూ వెనక్కిపంపాడు. వారికన్ (1)ను సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేయగా భోజన విరామం తర్వాత బుమ్రా.. పియారె (23)ను ఔట్ చేశాడు. సీల్స్ (13)ను కుల్దీప్ లెగ్‌బిఫోర్‌గా ఔట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
270 పరుగుల ఇన్నింగ్స్ లోటుతో ఫాలోఆన్‌కు వచ్చిన విండీస్ టీ విరామ సమయానికే 35/2తో నిలువగా మూడో రోజే విండీస్ ఖేల్ ఖతం అనుకున్నారంతా.. చందర్‌పాల్ (10), అథనేజ్ (7) విఫలమైనా క్యాంప్‌బెల్, హోప్ పోరాడారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరూ మెరుగ్గా ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. కుల్దీప్ బౌలింగ్‌లో బౌండరీతో 69 బంతుల్లో క్యాంప్‌బెల్ అర్ధశతకం పూర్తైంది. ఈ సిరీస్‌లో విండీస్ తరఫున హాఫ్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ అతడే కావడం విశేషం. మరో ఎండ్‌లో హోప్ కూడా నిలకడగా ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించాడు. జడేజా బౌలింగ్‌లో సింగిల్‌తో హోప్ కూడా ఫిఫ్టీ పూర్తిచేశాడు. టెస్టుల్లో 2019 తర్వాత అతడికి ఇదే మొదటి అర్ధశతకం. ఈ ఇద్దరినీ ఔట్ చేసేందుకు గిల్ పదే పదే బౌలర్లను మార్చినా విండీస్ జోడీ పట్టుదలగా ఆడటంతో భారత బౌలర్లకు నిరాశ తప్పలేదు. తొలిఇన్నింగ్స్‌లో ఫైఫర్‌తో రాణించిన కుల్దీప్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. నాలుగో రోజు బంతి మరింత మెలికలు తిరిగే అవకాశమున్నందున విండీస్ బ్యాటర్లు భారత దాడిని ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.
భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5;
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 81.5 ఓవర్లలో 248 ఆలౌట్ (అథనేజ్ 41, హోప్ 36, కుల్దీప్ 5/82, జడేజా 3/46);
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 49 ఓవర్లలో 173/2 (క్యాంప్‌బెల్ 87*, హోప్ 66*, సిరాజ్ 1/10, వాషింగ్టన్ 1/44)