న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో నాలుగోసారి ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకున్న భారత పురుషుల జట్టు.. ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆదివారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా మూడో స్థానానికి ఎగబాకింది. భారత్ 2771 పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరగా.. నెదర్లాండ్స్ (3095 పాయింట్లు), బెల్జియం (2917 పాయింట్లు) వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి.
2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన తర్వాత భారత్ మూడో ర్యాంక్‌కు చేరగా.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తిరిగి అదే ప్లేస్ దక్కించుకుంది. శనివారం చెన్నై వేదికగా జరిగిన ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4-3 తేడాతో మలేషియాను మట్టికరిపించి ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.