Under-19 Asia Cup : అండర్ -19 ఆసియా కప్‌లో అదరగొడుతున్న భారత జట్టు (Team India) ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులను వణికించిన టీమిండియా.. సెమీఫైనల్లో శ్రీలంక (Srilanka)ను చిత్తు చేసింది. మొదట ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన యువ భారత్.. అనంతరం డక్‌వర్త్ లూయిస్ (DLS) ప్రకారం 18 ఓవర్లకు కుదించిన లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. టాపార్డర్ విఫలమైనా.. అరోన్ జార్జ్(58 నాటౌట్), విహాన్ మల్హోత్రా(61 నాటౌట్)లు అర్ధ శతకాలతో మెరవగా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రతిష్ఠాత్మక అండర్ -19 ఆసియా కప్‌లో భారత్ అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ఐసీసీ అకాడమీలో జరిగిన సెమీఫైనల్లో శ్రీలంకను అలవోకగా మట్టికరిపించింది. తొలుత శ్రీలంకను హెనిల్ పటేల్(2-31), కనిష్క్ చౌహన్(2-36) స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. వీరిద్దరి జోరుతో టాపార్డర్ విఫలమైనా.. కెప్టెన్ విమన్ దిన్సర(32), చమిక హీనతిగల(42)లు రాణించగా 20 ఓవర్లలో లంక 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనంతరం వర్షం పడడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు.
Through to the final! 👏
An impressive 8⃣-wicket victory for India U19 over Sri Lanka U19 in the semi-final. 🙌
Scorecard ▶️ https://t.co/C7k4wXuH0P#MensU19AsiaCup2025 pic.twitter.com/6hOhNpb9fh
— BCCI (@BCCI) December 19, 2025
స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే(7), వైభవ్ సూర్యవంశీ(9)లు విఫలమైనా.. అరోన్ జార్జ్(58 నాటౌట్), విహాన్ మల్హోత్రా(61 నాటౌట్)లు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా దంచేశారు. లంక బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ద్వయం అజేయంగా జట్టును గెలిపించింది. కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చిన అరోన్, విహాన్ ఇద్దరూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యారు.
డిసెంబర్ 21 ఆదివారం టైటిల్ పోరులో పాకిస్థాన్‌ను ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు ఢీకొట్టనుంది. లీగ్ దశలో పాక్‌ను చిత్తుగా ఓడించడం భారత బృందానికి ప్లస్ కానుంది. ఇప్పటివరకూ దాయాదులు చెరో 11 సార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచాయి. మరి.. పన్నెండో ట్రోఫీని ఒడిసిపట్టేది ఎవరో చూడాలి. గతంలో 1989, 2003, 2012, 2013-14, 2016, 2018, 2019, 2021లో యువ భారత్ కప్పు గెలిచింది. బంగ్లాదేశ్ సైతం 10 పర్యాయాలు ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.