Team India | గ్వాలియర్ : ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచాక స్వదేశంలో ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో యువ భారత్ దుమ్మురేపింది. తమకంటే అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. మాధవరావు సింధియా నూతన క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, అర్ష్‌దీప్ సింగ్ (3/14), స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/31) ధాటికి బంగ్లా 19.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. మెహిది హసన్ ( 35 నాటౌట్) టాప్ స్కోరర్. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ (1/21) ఆకట్టుకున్నాడు. అనంతరం స్వల్ప ఛేదనను భారత్ 11.5 ఓవర్లలోనే దంచేసింది. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్(29) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. శాంసన్ (29) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు.
అర్ష్‌దీప్, వరుణ్ అదుర్స్
అర్ష్‌దీప్ మొదటి ఓవర్లోనే లిటన్ దాస్ (4)ను పెవిలియన్‌కు పంపి బంగ్లా వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. తన మరుసటి ఓవర్లో హోసేన్ ఎమొన్ (8)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. వరుణ్ చక్రవర్తి 5వ ఓవర్లో తౌహిద్ హృదయ్ (12) రెండు ఫోర్లు బాదగా శాంతో (27) సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించే యత్నం చేశారు. కానీ అతడే వేసిన 7వ ఓవర్లో తౌహిద్.. హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలి ఓవరే మెయిడిన్ వేసిన యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ తన రెండో ఓవర్లో మహ్మదుల్లాను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. శాంతోను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చినవారిలో మిరాజ్ ఒక్కడే కాస్త దూకుడుగా ఆడటంతో బంగ్లా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
భారత్ ధనాధన్..
ఛేదనలోను భారత్ దూకుడుగా ఆరంభించింది. షోరిఫుల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే శాంసన్ రెండు బౌండరీలు సాధించాడు. రెండో ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ.. 6, 4, 4 తో జోరు చూపించినా దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో సంజూతో జతకలిసిన సూర్య.. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌రెడ్డి (16 నాటౌట్)తో జతకలిసిన హార్దిక్ పాండ్యా.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగడంతో 49 బంతులు మిగిలుండగానే భారత్ గెలిచింది.