ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు సంబంధించిన టెలివిజన్ చానెల్ ప్రసారాలపై కొరడా ఝుళిపించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా అక్కడి యూట్యూబ్ చానెళ్లనూ నిషేధించింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో పాక్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెళ్లకు సంబంధించిన ప్రసారాలు భారత్‌లో బంద్ కానున్నాయి. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, పాక్ యూట్యూబర్లు నిర్వహిస్తున్న చానెళ్లలోని కంటెంట్ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉండదని యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. పాక్‌కు చెందిన ప్రముఖ డాన్ న్యూస్, సామా టీవీ, ఎఆర్‌వై న్యూస్, జియో న్యూస్ వంటి టీవీ చానెళ్లపై కేంద్రం ఇప్పటికే నిషేధం విధించిన విషయం విదితమే.