Nitish Kumar Reddy | అవకాశాలను అందిపుచ్చుకుంటూ కుర్రాళ్లు కుమ్మేశారు. బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో తెలుగు యువ క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. టాపార్డర్ విఫలమైన చోట తాను ఉన్నానంటూ బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేస్తూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. 41 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన వేళ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూ రింకూతో కలిసి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. ఏడు సిక్స్‌లతో స్టేడియాన్ని ఊపేసిన నితీశ్..బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి ఔరా అనిపించుకున్నాడు. లక్ష్యఛేదనలో భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన బంగ్లా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను అప్పగించేసింది.
న్యూఢిల్లీ: టీమ్ఇండియా యువ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. బుధవారం జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. భారత్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకు పరిమితమైంది. మహ్మదుల్లా(41) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. వరుణ్‌చక్రవర్తి(2/19), నితీశ్‌కుమార్(2/23) రెండేసి వికెట్ల తీశారు. అంతకుముందు నితీశ్(34 బంతుల్లో 74, 4ఫోర్లు, 7సిక్స్‌లు), రింకూసింగ్(29 బంతుల్లో 53, 5ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్ అర్ధసెంచరీలతో టీమ్ఇండియా 20 ఓవర్లలో 221/9 స్కోరు చేసింది. రిషాద్హుస్సేన్(3/55) మూడు వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన నితీశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 12న హైదరాబాద్ మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది.
నితీశ్, రింకూ అదుర్స్ : తొలుత టాస్ గెలిచిన బంగ్లా..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మెహదీహసన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ వరుస బంతుల్లో శాంసన్(10) రెండు ఫోర్లు కొట్టి దూకుడుగా ప్రారంభించాడు. అయితే ఆ మరుసటి ఓవర్ ఆఖరి బంతికి షాట్ ఆడబోయిన శాంసన్..శాంతోకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తంజిమ్ మూడో ఓవర్లో వరుస ఫోర్లతో జోరు మీద కనిపించిన అభిషేక్‌శర్మ(15)..చివరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..నితీశ్‌కుమార్ సంయమనం పాటించాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన ముస్తాఫిజుర్..కెప్టెన్ సూర్యకుమార్(8)ను స్లో బాల్‌తో బోల్తా కొట్టించాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. ఈ సమయంలో నితీశ్, రింకూసింగ్..ఇన్నింగ్స్ బాధ్యతను భుజానెత్తుకున్నారు. కెరీర్లో రెండో మ్యాచ్ ఆడుతున్న నితీశ్ మంచి పరిణతి కనబరిచాడు. రిషాద్ వేసిన 10వ ఓవర్లో నితీశ్ కండ్లు చెదిరే సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. తానేం తక్కువ కాదన్నట్లు మరో ఎండ్‌లో రింకూ కూడా చెలరేగడంతో 10 ఓవర్లకు భారత్ 101/3 స్కోరుకు చేరుకుంది. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా చెలరేగిన నితీశ్ 27 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన మెహదీని నితీశ్ గట్టిగా అరుసుకున్నాడు. మూడు భారీ సిక్స్‌లకు తోడు ఓ ఫోర్‌తో 26 పరుగులు పిండుకున్నాడు. ముస్తాఫిజుర్ వేసిన మరుసటి ఓవర్లో 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నితీశ్ వెనుదిరిగాడు. దీంతో నాలుగో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓవైపు నితీశ్ ఔటైనా..హార్దిక్‌తో కలిసి రింకూ తన జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో ఓ భారీ సిక్స్‌తో అర్ధసెంచరీ ఖాతాలో వేసుకున్న రింకూ తస్కిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్(15), హార్దిక్(32), వరుణ్(0), అర్ష్‌దీప్‌సింగ్(0) వెంటవెంటనే ఔటయ్యారు.
బంగ్లా ఢమాల్ : భారీ లక్ష్యఛేదనలో బంగ్లా ఆది నుంచే తడబాటుకు గురైంది. అర్ష్‌దీప్ మూడో ఓవర్లో పర్వేజ్ హుసేన్(16) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ శాంతో(11)..సుందర్‌కు వికెట్ ఇచ్చుకోగా, లిటన్ దాస్(14)ను వరుణ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో పవర్‌ప్లే పూర్తయ్యే సరికి బంగ్లా 43/3 స్కోరు చేసింది. ఇలా వరుస విరామాల్లో బంగ్లా వికెట్లు కోల్పోతూ వచ్చింది. మిడిలార్డర్లో మహ్మదుల్లా ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయింది.
భారత్: 20 ఓవర్లలో 221/9(నితీశ్ 74, రింకూ 53, రిషాద్ 3/55, తస్కిన్ 2/16),
బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 135/9(మహ్మదుల్లా 41, పర్వేజ్ 16, వరుణ్ 2/19, నితీశ్ 2/23)