భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలక టెస్టుకు నేడు తెరలేవనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లూ తలా ఓ మ్యాచ్ నెగ్గగా ఓ టెస్టు డ్రా గా ముగిడయంతో గురువారం నుంచి మొదలుకాబోయే ‘బాక్సింగ్ డే’ టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగాల్సి ఉన్న ఈ మ్యాచ్‌లో గెలుపుపై ఇరు జట్లూ ధీమాతో ఉన్నాయి. ఎంసీజీలో గెలిచి సిరీస్‌ను దక్కించుకునేందుకు కంగారూలు ప్రణాళికలు రచిస్తుండగా దశాబ్ద కాలంగా ఇక్కడ ఆడిన మూడు టెస్టులలోనూ ఓటమన్నదే లేని టీమ్ఇండియా.. అదే ఫీట్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును దక్కించుకోవాలని చూస్తున్న భారత్‌కు మెల్బోర్న్లో గెలవడం అత్యంత కీలకం.
IND vs AUS 4th Test | మెల్బోర్న్: ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి ప్రఖ్యాత మెల్బోర్న్ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది. మూడు మ్యాచ్‌లు ముగిసిన ఈ సిరీస్‌లో ఇరు జట్లూ తలా ఓ టెస్టు నెగ్గి (మూడో టెస్టు డ్రా) సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో గెలిచిన జట్టు సిరీస్‌ను దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆతిథ్య ఆస్ట్రేలియా కంటే ఈ మ్యాచ్‌లో గెలవడం రోహిత్ సేనకు అత్యంత ఆవశ్యకం. ఎంసీజీలో గెలిస్తే సిరీస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా జరగాల్సి ఉన్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో బెర్తును ఖాయం చేసుకునే అవకాశాలూ భారత్‌కు మరింత మెరుగవుతాయి. కాగా ఎంసీజీ పిచ్ బంతితో పాటు బ్యాట్‌కూ అనుకూలించే అవకాశం ఉండటంతో ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సిరీస్‌లో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్, రాహుల్, కోహ్లీ ప్రదర్శనలను మినహాయిస్తే భారత బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్నారు. అడిలైడ్‌లో దారుణ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. గబ్బాలో రాహుల్, జడేజా ఫర్వాలేదనిపించగా మిగిలినవారు కాడి వదిలేశారు. రాహుల్ ఓపెనర్‌గా రాణిస్తుండటంతో అతడి స్థానాన్ని వెనక్కి జరిపే సాహసం చేయలేక కెప్టెన్ రోహిత్ శర్మ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తున్నా రెండు టెస్టులలోనూ (3,6,10) అతడు కనీసం రెండంకెల స్కోరు చేయడానికే తంటాలు పడ్డాడు.
మెల్బోర్న్లో హిట్‌మ్యాన్ ఓపెనర్‌గా వస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే రాహుల్ మూడో స్థానంలో, గిల్ మిడిలార్డర్లో ఆడే చాన్స్ ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ మినహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం విఫల ప్రదర్శన భారత్‌ను వేధిస్తోంది. ఆఫ్‌సైడ్ ఆవల బంతులను వెంటాడి బలవుతున్న కోహ్లీ బలహీనత బ్రిస్బేన్ (7,11)లోనూ కొనసాగింది. మెల్బోర్న్లో మంచి రికార్డు కలిగిన విరాట్.. తనకు ఎంతో ఇష్టమైన ఎంసీజీలో అయినా బ్యాట్ ఝుళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గిల్, పంత్ మెల్బోర్న్లో సత్తా చాటాలని భారత్ భావిస్తోంది.
నాలుగో టెస్టులో తుది కూర్పుపైనా భారత్ తర్జనభర్జన పడుతోంది. సిరీస్‌లో ఆసీస్‌కు కళ్లెం వేస్తున్న పేసు గుర్రం బుమ్రాకు అండగా నిలిచే బౌలర్ లేకపోవడం టీమ్ఇండియాను దెబ్బతీస్తోంది. సిరాజ్ వికెట్ల వేటలో వెనుకబడుతున్నాడు. మూడో టెస్టు ఆడిన ఆకాశ్ దీప్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. అయితే ఎంసీజీ పిచ్ నాలుగో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలుండటంతో ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగొచ్చని సమాచారం. జడ్డూకు తోడుగా వాషింగ్టన్‌ను ఆడించేందుకు జట్టు మేనేజ్మెంట్ ప్రణాళికలు రచిస్తోంది. అదే జరిగితే తుది జట్టు నుంచి నితీశ్ రెడ్డిని తప్పించే అవకాశముంది. కానీ గత మూడు టెస్టులలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న నితీశ్‌పై వేటు వేస్తారా? అన్నది ఆసక్తికరం.
భారత్ మాదిరిగానే ఆసీస్‌నూ బ్యాటింగ్ కష్టాలు వేధిస్తున్నా రెండు జట్లకు తేడా ట్రావిస్ హెడ్ ప్రదర్శనలే. టీమ్ఇండియా అంటేనే ఎక్కడలేని ఉత్సాహంతో చెలరేగే హెడ్ మెల్‌బోర్న్‌లోనూ అదే సీన్ రిపీట్ చేస్తే మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటికే అతడు 89, 140, 152తో భీకర ఫామ్‌లో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ కూడా గబ్బా టెస్టులో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. ఖవాజా, లబూషేన్, మార్ష్ ఆశించిన స్థాయిలో రాణిస్తే భారత్‌కు తిప్పలు తప్పవు. హెడ్‌తో పాటు వీరిని అడ్డుకోవడానికి భారత్ ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగాలి. ఈ మ్యాచ్‌లో ఆసీస్.. ఓపెనర్ మెక్‌స్వీనే స్థానంలో సామ్ కొన్‌స్టాస్‌ను ఆడిస్తోంది. పేస్ త్రయం స్టార్క్, కమిన్స్, బొలాండ్‌కు తోడుగా ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ నాథన్ లియాన్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేసేందుకు సిద్ధమవుతున్నాడు.
2014 నుంచి మెల్బోర్న్లో భారత్ టెస్టు ఓడలేదు. 2018-19, 2020-21లో టీమ్ఇండియాదే విజయం.
ఇప్పటిదాకా ఆసీస్ 43 బాక్సింగ్ డే టెస్టులు ఆడితే అందులో 26 గెలిచింది. భారత్‌తో 9 ఆడి ఐదింటిలో నెగ్గింది.
భారత్ (అంచనా): యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రోహిత్ శర్మ (కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి/వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బొలాండ్