నిన్గో(చైనా):ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ కప్లో భారత్ ఎట్టకేలకు పతక ఖాతా తెరిచింది. పలువురు షూటర్లు ఘోరంగా నిరాశపరిచిన వేళ తాను ఉన్నానంటూ తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్..భారత్కు తొలి పసిడి పతకాన్ని అందించింది. శనివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషాసింగ్ 242.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో చైనా స్టార్ షూటర్ యావో జియాన్జున్(242.5) పాయింట్ తేడాతో వెనుకకు నెడుతూ ఇషా రజతానికి పరిమితం చేసింది.
కొరియా షూటర్ యెజిన్(220.7) కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఇషాకు ఇది తొలి ప్రపంచకప్ స్వర్ణం కాగా, ఈ పతకంతో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్నది. ‘ప్రపంచకప్లాంటి మొదటి ఈవెంట్లోనే పతకం గెలువడం చాలా సంతోషంగా ఉంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు గర్వంగా ఉంది’ అని ఇషా పేర్కొంది. ఈ విభాగంలో ఇషాతో పాటు భారత్ నుంచి రితమ్ సాంగ్వాన్ ఫైనల్కు అర్హత సాధించింది.