బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచిన నేపథ్యంలో మూడో టెస్టు కీలకం కాబోతున్నది. సిరీస్ విజేతను నిర్ణయించే గబ్బా టెస్టుపై అందరికీ ఆసక్తి నెలకొన్నది. పెర్త్‌లో భారత్ విజయ శంఖారావం పూరిస్తే..పుంజుకున్న ఆసీస్ అడిలైడ్‌లో గులాబీ ముల్లు గుచ్చింది. పేస్‌కు స్వర్గధామమైన గబ్బాలో భారత్, ఆసీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌పై పేసర్లు వికెట్ల పండుగ చేసుకోనున్నారు. కెప్టెన్ రోహిత్ ఓపెనింగ్‌కు వస్తాడా లేక ఆరుకు పరిమితమవుతాడా అన్నది తేలనుంది. రానా స్థానంలో ఆకాశ్‌దీప్ రాక ఖరారు కాగా, బోలాండ్ బదులుగా హాజిల్‌వుడ్ ఆసీస్ జట్టులోకి వచ్చేశాడు.
బ్రిస్బేన్ : బీజీటీ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర సమరానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.50 నిమిషాలకు మొదలయ్యే మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెర్త్ టెస్టు విజయంతో సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన టీమ్ఇండియాకు అడిలైడ్‌లో ఆసీస్..గులాబీ ముల్లుతో కిందికి దించింది. మరీ పేస్‌కు చిరునామా అయిన గబ్బాలో ఎవరిపై ఎవరి ఆధిపత్యమవుతుందో చూడాలి. పెట్టని కోటలాంటి గబ్బాలో కంగారూలకు మెరుగైన రికార్డు ఉంది. తమ పేస్ దళంతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించే ఆసీస్..మరోమారు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నది. సరిగ్గా మూడేండ్ల క్రితం ఇదే గబ్బాలో టీమ్ఇండియా చారిత్రక విజయం సాధించింది. మళ్లీ అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు భారత్ తహతహలాడుతున్నది. గబ్బాలో గెలిచిన జట్టు సిరీస్ గెలుస్తుందన్న నమ్మకాన్ని ఏ జట్టు నిజం చేస్తుందో చూడాలి.
జట్టులో కెప్టెన్ రోహిత్‌శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌పై సందిగ్ధత కొనసాగుతున్నది. అడిలైడ్ టెస్టులో ఆరో స్థానంలో వచ్చి విఫలమైన రోహిత్..తన రెగ్యులర్ స్థానమైన ఓపెనింగ్‌లో వస్తాడా లేదా అన్నది శనివారం తేలనుంది. అంతకుమించి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగే అవకాశం లేదు. సీనియర్లు రోహిత్, కోహ్లీ నిలకడలేమి జట్టును కలవరపెడుతున్నది. పెర్త్ టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ..అడిలైడ్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. హర్షిత్ రానా స్థానంలో ఆకాశ్‌దీప్ రాక దాదాపు ఖరారు కాగా, స్పిన్ ఆల్‌రౌండర్‌గా సుందర్ జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. పేస్ దళానికి బుమ్రా నాయకత్వం వహించనున్నాడు.
గాయంతో అడిలైడ్ పోరుకు దూరమైన హాజిల్‌వుడ్ గబ్బా టెస్టుకు సిద్ధమయ్యాడు. స్కాట్ బోలాండ్ స్థానంలో హాజిల్‌వుడ్ తుది జట్టులోకి రానున్నాడు. కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్ చెలరేగితే భారత్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. గబ్బాలో వీరి పేస్ దాడిని తట్టుకోవడం టీమ్ఇండియా బ్యాటర్లకు కత్తిమీద సామే కానుంది. లబుషేన్, స్మిత్ ఫామ్ కలవరపెడుతుండగా, హెడ్ జోరు ఆ జట్టుకు వరంగా మారింది.
భారత్: రోహిత్(కెప్టెన్), జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లీ, పంత్, రాహుల్/రోహిత్, నితీశ్‌కుమార్, సుందర్/అశ్విన్, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా
ఆస్ట్రేలియా: ఖవాజ, మెక్‌స్వీని, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, కమిన్స్(కెప్టెన్), స్టార్క్, లియాన్, హాజిల్‌వుడ్