ISSF | లిమా (పెరూ): ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. టోర్నీ నాలుగో రోజు భారత్‌కు ఏకంగా 5 స్వర్ణాలు, రెండు రజతాలు దక్కాయి. పురుషుల 25 మీటర్ల జూనియర్ పిస్టల్ ఫైనల్లో ముకేశ్ స్వర్ణం గెలవగా భారత్‌కే చెందిన సూరజ్ శర్మకు రజతం దక్కింది. ఇదే విభాగపు టీమ్ ఈవెంట్లో ముకేశ్, సూరజ్, ప్రధ్యుమ్న్ పసిడి గెలుచుకున్నారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో దివ్యాన్షి, తేజస్విని, విభూతి బంగారు పతకం సాధించారు. ఇదే విభాగం వ్యక్తిగత ఫైనల్లో దివ్యాన్షి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం ముద్దాడింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే 10 స్వర్ణాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.