Emerging Teams Asia cup | అల్ అమెరాత్(ఒమన్): ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20లో యువ భారత్ పోరాటం ముగిసింది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ ‘ఎ’..కీలకమైన సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్ ‘ఎ’ చేతిలో పోరాడి ఓడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తిలక్‌వర్మ సారథ్యంలోని టీమ్ఇండియా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అఫ్గన్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యఛేదనలో యువ భారత్ 20 ఓవర్లలో 186/7 స్కోరుకు పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాటర్ రమణ్‌దీప్‌సింగ్(34 బంతుల్లో 64, 8ఫోర్లు, 2సిక్స్‌లు) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌సింగ్(19), అభిషేక్‌శర్మ(7) విఫలం కాగా, మిడిలార్డర్లో తిలక్‌వర్మ(16), ఆయూశ్ బదోనీ(31), నేహాల్(20) అంతోఇంతో పరుగులు సాధించారు.
సహచరులు ఔటైనా రమణ్‌దీప్..కడదాకా గెలుపు కోసం ప్రయత్నించాడు. గజన్ఫర్, రెహమాన్ రెండేసి వికెట్లు తీశారు. తొలుత సెదీఖుల్లా(83), జుబైద్ అక్బరీ(64) అర్ధసెంచరీలతో అఫ్గన్ 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. రసిక్ సలామ్(3/25) ఆకట్టుకున్నాడు.