గువాహటి : తొలి టెస్టుకు పూర్తి భిన్నంగా సాగుతున్న రెండో టెస్టులో పర్యాటక దక్షిణాఫ్రికా రెండో రోజే మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన గువాహటి పిచ్‌పై రెండో రోజు భారత బౌలర్లు తేలిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. లోయరార్డర్ బ్యాటర్లు సెనురన్ ముత్తుస్వామి (206 బంతుల్లో 109, 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్కో యాన్సెన్ (91 బంతుల్లో 93, 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) రాణించడంతో ఆ జట్టు రెండో రోజూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. లోయరార్డర్ బ్యాటర్లు ఆ జట్టుకు రెండో రోజు ఏకంగా 242 పరుగులు జతచేయడం విశేషం. ఇక బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. వికెట్లేమీ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. యశస్వీ (7*), రాహుల్ (2*) క్రీజులో ఉన్నారు. మరో మూడు రోజులు మిగిలున్న ఈ మ్యా చ్లో సోమవారం ఆట కీలకం కానుంది.
రెండో రోజు ఆటలో ప్రధాన ఆకర్షణ భారత సంతతి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఆల్‌రౌండర్ సెనురన్దే. తన వ్యక్తిగత స్కోరు (25)తో రెండో రోజు ఆటను ఆరంభించిన అతడు.. సౌతాఫ్రికా చేతినుంచి ఈ టెస్టు జారిపోకుండా ఉండే చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను ఆడాడు. కైల్ వెరీన్ (122 బంతుల్లో 45, 5 ఫోర్లు), యాన్సెన్‌తో కలిసి అతడు భారత బౌలర్ల సహనానికి తీవ్ర పరీక్ష పెట్టాడు. తొలి గంటలో సెనురన్, వెరీన్ ద్వయం నిలకడగా ఆడి సఫారీల స్కోరును 300 దాటించింది. బుమ్రా, సిరాజ్, సుందర్, జడేజా, కుల్దీప్.. ఇలా బౌలర్లు మారినా భారత్‌కు వికెట్లు మాత్రం దక్కలేదు. ఈ క్రమంలోనే సెనురన్ 121 బంతుల్లో తన అర్ధ శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. 316/6తో టీ విరామానికి వెళ్లొచ్చిన ఈ జోడీని ఎట్టకేలకు జడేజా విడదీశాడు. జడ్డూ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయిన వెరీన్.. స్టంపౌట్‌గా వెనుదిరగడంతో 88 పరుగుల 7వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ జోడీ నిష్క్రమించినా భారత్‌కు యాన్సెన్ రూపంలో మరో ప్రమాదం తప్పలేదు. యాన్సెన్, ముత్తుస్వామి జోడీ జోరుగా ఆడటంతో ఆ జట్టు 400 పరుగుల మార్కును దాటేసింది. యాన్సెన్ సిక్సర్ల మీద సిక్సర్లు బాదగా కుల్దీప్ ఓవర్లో 6,4తో సెనురన్ శతకానికి చేరువయ్యాడు. సిరాజ్ ఓవర్లో స్వీపర్ కవర్ దిశగా రెండు రన్స్ తీసి తన కెరీర్లో తొలి శతకాన్ని నమోదుచేశాడు. ఇదే జోరులో యాన్సెన్ 53 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేయడంతో సఫారీ జట్టు లంచ్‌కు వెళ్లింది.
లంచ్ విరామం తర్వాత రెండో ఓవర్లోనే ముత్తుస్వామిని సిరాజ్ ఔట్ చేయడంతో టీమ్ఇండియా ఊపిరి పీల్చుకుంది. ముత్తుస్వామి, యాన్సెన్ జోడీ 8వ వికెట్‌కు 106 బంతుల్లోనే 97 రన్స్ జోడించడం విశేషం. ముత్తుస్వామి నిష్క్రమించిన ఆనందమూ భారత్‌కు ఎక్కువసేపు నిలువలేదు. జడ్డూ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన యాన్సెన్.. సిరాజ్ ఓవర్లోనూ 4,6తో స్కోరుబోర్డును 450 దాటించాడు. హర్మర్ (5)ను బుమ్రా బౌల్డ్ చేయగా సెంచరీకి ఏడు పరుగుల దూరంలో ఉండగా యాన్సెన్‌ను కుల్దీప్ బౌల్డ్ చేయడంతో ఆ జట్టు ఇన్నింగ్స్‌కు తెరపడింది.
1 తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు 480+ కంటే ఎక్కువ స్కోరు చేసినా భారత జట్టు టెస్టు మ్యాచ్‌ను గెలుచుకున్న సందర్భం ఒకసారి (2003 అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై) మాత్రమే!
3 భారత్‌తో టెస్టుల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ముత్తుస్వామిది మూడో (గతంలో డికాక్, క్లూసెనర్) స్థానం.
దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 151.1 ఓవర్లలో 489 ఆలౌట్ (ముత్తుస్వామి 109, యాన్సెన్ 93, కుల్దీప్ 4/115, బుమ్రా 2/75); భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 6.1 ఓవర్లలో 9/0