శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్ చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్సులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగి 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత లంకేయులను తన స్పిన్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. ఐదు వికెట్లు తీసి శ్రీలంక 174 పరుగులకే ఆలౌట్ అవడంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో ఫాలో ఆన్ ఆడుతున్న లంక బ్యాటర్లను మరోసారి స్పిన్నర్లు ఇబ్బంది పెడుతున్నారు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన చరిత్ ఆసలంక (9 బంతుల్లో 20).. అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆఫ్‌స్టంప్ దగ్గరగా అతను వేసిన ఫ్లైటెడ్ డెలివరీని డిఫెండ్ చేసేందుకు ఆసలంక ప్రయత్నించాడు.
కానీ అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ పంత్ ప్యాడ్లను తాకి గాల్లోకి లేచింది. అక్కడే స్లిప్‌లో ఉన్న కోహ్లీ చటుక్కున ఆ బంతిని పట్టేసి ఆసలంకను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన జడేజా కుదురుకున్న ఏంజెలో మాథ్యూస్ (28), సురంగ లక్మల్ (0)ను వెనక్కు పంపాడు. దీంతో లంక జట్టు 38 ఓవర్లు ముగిసే సరికి 126/7 స్కోరుతో నిలిచింది.