IND Vs SA | లక్నోలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయింది. ఐదో టీ20 మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. పొగమంచు కారణంగా గత మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో అందరి దృష్టి మ్యాచ్‌పైనే ఉన్నది. సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌ను డ్రాగా ముగించాలని దక్షిణాఫ్రికా భావిస్తున్నది. అయితే, టెస్టుల్లో ఓటమి తర్వాత.. వన్డే సిరీస్‌ను నెగ్గిన టీమిండియాకు ఈ టీ20 సిరీస్‌ను గెలిచేందుకు అవకాశం ఉన్నది.
బుధవారం లక్నోలోని భారత్ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ టాస్ వేయకుండానే రద్దయింది. దట్టమైన భారీ పొగమంచు కారణంగా, దృశ్యమానత చాలా తక్కువగా ఉండటంతో మ్యాచ్‌ను నిర్వహించడం సాధ్యపడలేదు. స్టేడియంలో పొగమంచు ఎంత దట్టంగా ఉందంటే గాలిలో ఎగురుతూ వచ్చే బంతితో ఫీల్డర్లకు ప్రమాదకరంగా ఉంటుంది. ఈ క్రమంలో మ్యాచ్‌ను నిర్వహించేందుకు అంపైర్లు ఆరుసార్లు మైదానాన్ని పరిశీలించి.. చివరకు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు.
ఈ టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. లక్నోకు భిన్నంగా అహ్మదాబాద్ మైదానం ఉంటుంది. ఈ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. హై స్కోరింగ్ మ్యాచులకు పెట్టింది పేరు. ఈ మ్యాచ్ కోసం హార్దిక్ పాండ్యా లక్నోలో ఫేస్ మాస్క్ ధరించి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే, కాలుష్యం ఉందా? అన్న చర్చకు దారి తీసింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా కొనసాగుతుండడం ఆందోళన వ్యక్తమవుతున్నది. కానీ, అహ్మదాబాద్‌లో పరిస్థితి సానుకూలంగా ఉన్నది. అహ్మదాబాద్‌లో వాయు నాణ్య మధ్యస్తంగా ఉన్నది. డిసెంబర్ 18న ఏక్యూఐ 139గా నమోదైంది. శుక్ర, శనివారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలున్నాయి.
అయితే, మ్యాచ్‌లో విజిబిలిటీ ప్రమాదం ఏమీ ఉండదని.. ప్రతికూల వాతావరణం మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. నాలుగో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో లక్నోలో నమోదైన కాలుష్య స్థాయిల కంటే అహ్మదాబాద్‌లో కాలుష్య స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నది. వాతావరణ అప్డేట్ ప్రకారం.. మ్యాచ్‌కు పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సాయంత్రం ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 15 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం లేదని.. అభిమానులు మ్యాచ్‌ను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.