భారత వెటరన్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26) అవుటవడంతో క్రీజులోకి వచ్చిన పుజారా కుదురుకున్నట్లే కనిపించాడు. 33 బంతులాడిన అతను కేవలం 3 పరుగులే చేసినా కూడా సరే క్రీజులో కుదురుకున్నాడు కదా అని అభిమానులు భావించారు.
కానీ వాళ్ల ఆశలను ఆవిరి చేసిన ఈ నయావాల్.. డుయాన్నే ఆలివర్ వేసిన బౌన్సర్‌ను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో విఫలమై పాయింట్లో ఉన్న టెంబా బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సెంచూరియన్ టెస్టులో కూడా పుజారా పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.
పుజారా పెవిలియన్ చేరడంతో వచ్చిన రహానే కూడా చెత్త షాట్ ఆడి తొలి బంతికే వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్ వికెట్ ఆవల ఆలివర్ వేసిన బంతిని అనవసరంగా ఆడిన రహానే.. ఏం చేయాలనుకున్నాడో కానీ అతని ప్లాన్ ఫలించలేదు. అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి గల్లీలోని పీటర్సన్‌కు చేరింది.
దాన్ని అందుకోవడానికి కొంత తంటాలు పడినప్పటికీ చివరకు కీగన్ పీటర్సన్ క్యాచ్ పట్టేయడంతో తొలి బంతికే గోల్డెన్ డక్‌గా రహానే వెనుతిరిగాడు. ఇది ఆలివర్‌కు టెస్టుల్లో 50వ వికెట్ కావడం గమనార్హం.