రెండో టెస్టులో భారత బౌలింగ్ దళానికి అడ్డుగా నిలిచి, సఫారీలను గెలిపించుకున్న సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్‌ను మూడో టెస్టులో బుమ్రా పెవిలియన్ చేర్చాడు. మార్క్రమ్ (16)ను షమీ పెవిలియన్ చేర్చిన తర్వాత మరో వికెట్ పడకుండా ఎల్గార్ (30), కీగన్ పీటర్సన్ (48 నాటౌట్) అడ్డుకున్నారు.
వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో సౌతాఫ్రికా 29 ఓవర్లకే వంద పరుగులు చేసింది. అయితే 30వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా.. నాలుగో బంతికి ఎల్గార్‌ను అవుట్ చేశాడు. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని ఎల్గార్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు.
ఆ బంతిని అందుకున్న పంత్ అప్పీల్ చేశాడు. అంపైర్ స్పందించలేదు. దీంతో పంత్, బుమ్రాలను అడిగిన కోహ్లీ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో బంతి ఎల్గార్ బ్యాట్‌ను స్వల్పంగా తాకినట్లు తేలింది. దీంతో ఎల్గార్ ఇన్నింగ్స్ ముగిసింది. అలాగే మూడో రోజు ఆట కూడా ముగిసింది. ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా జట్టు 101/2 స్కోరుతో నిలిచింది.