క్రికెట్ ప్రపంచంలో అత్యంత హీట్ పెంచే మ్యాచ్లు భారత్-పాక్ మధ్యనే జరుగుతాయనడం అతిశయోక్తి కాదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోందంటే.. ప్రపంచం మొత్తం ఆగిపోయి మరీ ఈ మ్యాచ్ చూస్తుందని కొందరు అంటారు. కొన్ని నెలల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ దీనికి మంచి ఉదాహరణ.
ఈ మ్యాచ్ ఎన్నో వ్యూయర్షిప్ రికార్డులు తిరగరాసింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చైర్మన్ రమీజ్ రాజా ఎత్తిచూపాడు. అభిమానులకు కావలసింది ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందని రాజా చెప్పాడు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ పరిస్థితుల వల్ల ఈ రెండు దేశాల జట్లు క్రికెట్ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే.
ఇలాంటి సమయంలోనే పీసీబీ చైర్మన్ అయిన రమీజ్ రాజా కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు భారత్-పాక్ మ్యాచుల కోసం ఆయన చేసిన ప్రతిపాదన కూడా కొందరిని ఆకట్టుకుంటోంది. ప్రతిఏటా నాలుగు దేశాల మధ్య టీ20 సిరీస్లు ఏర్పాటు చేయాలని, తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ నాలుగు దేశాల బోర్డులు సమానంగా పంచుకోవాలని సూచించాడు.
దీనికోసం ఐసీసీలో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి, దానికి విడిగా ఒక సీఈవోను నియమించాలన్నాడు. ‘టీ20 ప్రపంచకప్లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎన్ని రికార్డులు తిరగరాసిందో చూశాం కదా. అభిమానుల ఆకలి తీర్చేలా ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది’ అని రాజా పేర్కొన్నాడు.