IND vs NZ | ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు ఐదోమ్యాచ్ను న్యూజిలాండ్‌తో ఆడనున్నది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరుగనున్నది. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌పైనే అందరూ దృష్టి సారించారు. ఇరు జట్లు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఏ ఒక్కదాంట్లోనూ ఓటమి లేకపోవడం విశేషం. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ ఉత్కంఠగా సాగననున్నది. అయితే, ఈ మ్యాచ్‌కు వానగండం పొంచి ఉన్నది.
2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో కివీ జట్టు 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. దీంతో ఆ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నది. చివరిసారి మాంచెస్టర్‌లో రెండు జట్ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగ్గా.. వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. రెండుజట్లు రిజర్వ్ డేలో ఆడాల్సి వచ్చింది. తాజాగా ఆదివారం జరిగే మ్యాచ్‌కు సైతం వానగండం పొంచి ఉన్నది. తుఫాను ప్రభావంతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. మధ్యాహ్నం సమయానికి తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపింది.
ఇంతకు ముందు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు సైతం వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 43 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ధర్మశాలలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 13 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, 74శాతం మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. సాయంత్రం నాటికి ఉష్ణోగ్రత మరింత పడిపోతుందని తెలిపింది. ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగితే.. ఐసీసీ ప్రపంచకప్ నిబంధనల ప్రకారం.. భారత్ – న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌కు ‘రిజర్వ్’ లేదు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టీమిండియా, కివీ జట్లకు చెరోపాయింట్ లభించనున్నది.